IND vs PAK: 2027 వన్డే వరల్డ్‌ కప్‌.. ఏకంగా మూడుసార్లు ఢీకొట్టనున్న భారత్, పాకిస్థాన్ జట్లు!

IND vs PAK Could Clash Three Times in ICC ODI World Cup 2027. వన్డే ప్రపంచ కప్ 2027లో భారత్, పాకిస్థాన్ ఏకంగా మూడు సార్లు తలపడే అవకాశాలు ఉన్నాయి.

Rishvik
Published on: 15 July 2026 6:56 PM IST
IND vs PAK
X

IND vs PAK: 2027 వన్డే వరల్డ్‌ కప్‌.. ఏకంగా మూడుసార్లు ఢీకొట్టనున్న భారత్, పాకిస్థాన్ జట్లు!

IND vs PAK: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. పురుషుల వన్డే ప్రపంచ కప్, టీ20 వరల్డ్‌ కప్‌ ఫార్మాట్లో సమూల మార్పులను చేస్తున్నట్లు ప్రకటించింది. 14 జట్లు తలపడే వన్డే వరల్డ్‌ కప్‌లో మూడు దశల ఫార్మాట్‌ను ప్రవేశపెట్టింది. వన్డే ప్రపంచ కప్ ఫార్మాట్‌లో చేసిన మార్పులు అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీలో భారత్, పాకిస్థాన్ ఏకంగా మూడు సార్లు తలపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క ప్రపంచ కప్‌లో చిరకాల ప్రత్యర్ధులు ఒకసారి మాత్రమే తలపడగా.. కొత్త ఫార్మాట్ కారణంగా మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో అభిమానులతో పాటు బ్రాడ్‌కాస్టర్లలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

2027 ప్రపంచ కప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. కొత్త ఫార్మాట్ ప్రకారం.. ర్యాంకింగ్స్‌లో చివరి మూడు స్థానాల్లో ఉన్న జట్లు ముందుగా 'సూపర్ సిరీస్' దశలో పోటీ పడతాయి. అందులో విజేతగా నిలిచిన జట్టు మాత్రమే ప్రధాన టోర్నీలోని రెండో దశకు అర్హత సాధిస్తుంది. ఆ తర్వాత 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో ఆరు జట్లు లీగ్ దశలో తలపడతాయి. ప్రతి గ్రూపులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు రెండు గ్రూపుల్లోని తర్వాత అత్యుత్తమ టీమ్‌తో కలిపి ‘సూపర్‌ 7’ స్టేజ్‌కు టోర్నీ వెళ్తుంది.

ప్రస్తుతం గ్రూపులు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్‌ను ఒకే గ్రూపులో ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎప్పటినుంచో వస్తోంది. ఈసారి కూడా అదే జరిగితే గ్రూప్ దశలోనే తొలి భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత రెండు జట్లు కూడా సూపర్-7కు అర్హత సాధిస్తే.. రౌండ్-రాబిన్ విధానంలో మరోసారి పరస్పరం తలపడాల్సి ఉంటుంది. దీంతో కనీసం రెండు మ్యాచ్‌లు ఖాయం అన్నమాట. అంతేకాకుండా సూపర్-7 దశ ముగిసిన తర్వాత తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ఒకవేళ భారత్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో ఎదురుపడే విధంగా స్థానాలు దక్కించుకుంటే.. మూడోసారి కూడా తలపడే అవకాశం ఉంటుంది. దీంతో ఒకే వన్డే ప్రపంచ కప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇప్పటి వరకు వన్డే ప్రపంచ కప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు మొత్తం ఎనిమిది సార్లు తలపడ్డాయి. ఆ ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. అయితే ఒకే ప్రపంచ కప్‌లో రెండు కంటే ఎక్కువసార్లు దాయాది జట్లు ఎప్పుడూ ఎదురుపడలేదు. ఇప్పుడు ఐసీసీ తీసుకొచ్చిన కొత్త ఫార్మాట్‌తో ఆ పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన ప్రత్యర్థుల పోరును అభిమానులు ఒకే టోర్నీలో మూడుసార్లు ఆస్వాదించే అవకాశం దక్కనుంది. అప్పుడు అభిమానులే కాదు బ్రాడ్‌కాస్టర్లు కూడా పండగ చేసుకుంటాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story