IND Vs SL: ఆ రెండు సెషన్లు మ్యాచ్‌కే కీలకం..గాల్ టెస్ట్‌లో గెలవాలంటే గిల్‌కిదే ఏకైక మార్గం
IND Vs SL: మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 178 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన భారత్, గాల్ మైదానంలో విజయం సాధించేందుకు వినూత్న వ్యూహాలతో సిద్ధమవుతోంది.
India Vs SriLanka
IND Vs SL: గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మొదలైన ఈ కీలక టెస్ట్ పోరులో మూడు రోజుల ఆట పూర్తయ్యేసరికి రెండు జట్లు తమ తొలి ఇన్నింగ్స్‌లను పూర్తి చేశాయి. టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో పటిష్టమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 462 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీనికి సమాధానంగా బరిలోకి దిగిన శ్రీలంక జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక కేవలం 284 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టుకు మొదటి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 178 పరుగుల మైండ్ బ్లాకింగ్ ఆధిక్యం లభించింది.
గిల్, గంభీర్ల ముందున్న నయా మాస్టర్ ప్లాన్
మొదటి టెస్టులో జయభేరి మోగించాలంటే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగో రోజు తొలి రెండు సెషన్లలో వీలైనంత వేగంగా పరుగులు రాబట్టడమే జట్టు ముందున్న ప్రధాన లక్ష్యం. ఇన్నింగ్స్ వేగవంతం చేసి బోర్డుపై మరో 250 పరుగులు చేర్చగలిగితే, శ్రీలంక ముందు దాదాపు 430 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఉంచవచ్చు. ఆ తర్వాత ప్రత్యర్థికి నాలుగు సెషన్ల సమయం ఇచ్చి ఆలౌట్ చేస్తేనే భారత్‌కు విక్టరీ సాధ్యమవుతుంది.
ఆ ఒక్క తప్పు చేస్తే మ్యాచ్ డ్రా అయ్యే ప్రమాదం
నాలుగో రోజు మొత్తం టీమిండియా బ్యాటింగ్ చేయడానికే పరిమితమైతే మ్యాచ్ డ్రాగా ముగిసే ప్రమాదం పొంచి ఉంది. అందుకే నాలుగో రోజు ఆఖరి సెషన్‌లోనే శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించడం శ్రేయస్కరం. అలా చేస్తే నాలుగో రోజు ముగిసే సమయానికి ప్రత్యర్థి టాప్ ఆర్డర్‌లో 2 నుంచి 3 వికెట్లు పడగొట్టవచ్చు. ఇది శ్రీలంకను పూర్తిగా ఆత్మరక్షణలో పడేస్తుంది. చివరి రోజున ఒత్తిడి పెంచి మిగిలిన వికెట్లు పడగొట్టడం భారత బౌలర్లకు చాలా సులువవుతుంది.
భారత్ గెలుపుకు విలన్‌గా మారనున్న వర్షం?
ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పేది కేవలం మైదానంలో ఆటే కాదు, ఆకాశంలో మేఘాలు కూడా. మ్యాచ్ ప్రారంభమైన మొదటి మూడు రోజులు వర్షం తీవ్రంగా అంతరాయం కలిగించింది. రెండో రోజు వాతావరణం దెబ్బకు కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. నాలుగో రోజు కూడా వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం తొలి సెషన్‌లో 50 శాతానికి పైగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రెండో సెషన్ కాస్త అనుకూలించినా, మూడో సెషన్‌లో మళ్లీ వాన గండం పొంచి ఉంది. గాల్ టెస్ట్‌లో భారత్ గెలుపు అనేది పూర్తిగా వర్షం ఇచ్చే విరామం, గిల్ తీసుకునే వేగవంతమైన డిక్లరేషన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. సమయం తక్కువగా ఉన్నందున టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దూకుడుగా ఆడితేనే విజయం సొంతమవుతుంది.




