IND vs SL Tests: భారత్-శ్రీలంక టెస్ట్ షెడ్యూల్ విడుదల.. టీమిండియాకు పెను సవాల్!
IND vs SL Tests: IND vs SL Test Series 2026 Schedule. భారత్-శ్రీలంక మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ ప్రకటించింది.
IND vs SL Tests: భారత్-శ్రీలంక టెస్ట్ షెడ్యూల్ విడుదల.. టీమిండియాకు పెను సవాల్!
IND vs SL Tests: భారత్-శ్రీలంక మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) గురువారం అధికారికంగా ప్రకటించింది. 2025-27 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా ఈ కీలక సిరీస్ ఆగస్టు 15 నుంచి 27 వరకు శ్రీలంకలో జరగనుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో, రెండో టెస్ట్ కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (ఎస్ఎస్సీ) మైదానంలో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్ట్ జరుగుతుంది. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ముందంజ వేయాలంటే.. ఈ సిరీస్ రెండు జట్లకూ ఎంతో కీలకంగా మారింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా.. శ్రీలంక ఆరో స్థానంలో కొనసాగుతోంది. గత రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిళ్లలో భారత్ ఫైనల్‌కు చేరినా టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది. ఈసారి ఫైనల్ రేసులో బలంగా నిలవాలంటే.. శ్రీలంక పర్యటనలో విజయాలు సాధించడం టీమిండియాకు అత్యంత కీలకం.
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఈ పర్యటనకు సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌లో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసిన భారత్.. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌పై సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే గత ఏడాది స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన వైట్‌వాష్ భారత బ్యాటర్ల స్పిన్ బలహీనతలను బయటపెట్టింది. ఇప్పుడు శ్రీలంకలోని స్పిన్‌కు అనుకూల పిచ్‌లపై ఆతిథ్య జట్టు స్పిన్నర్లను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు మరో పెద్ద పరీక్షగా మారనుంది. గాలే వంటి వేదికల్లో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుండటంతో భారత బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.
భారత్ చివరిసారిగా 2017లో టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఆ సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో 3-0 తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించి క్లీన్‌స్వీప్ చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడనున్న భారత్.. అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. ఈ సిరీస్ అనంతరం భారత్ నవంబర్-డిసెంబర్ నెలల్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. కాబట్టి శ్రీలంక సిరీస్ డబ్ల్యూటీసీ పాయింట్లతో పాటు భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచే అవకాశంగా కూడా భావిస్తున్నారు.
టెస్ట్ షెడ్యూల్:
తొలి టెస్టు: ఆగస్టు 15-19 (గాలే)
రెండో టెస్టు: ఆగస్టు 23-27 (కొలంబో)




