ZIM vs IND: జింబాబ్వేతో తొలి టీ20.. బుడ్డోడికి ఛాన్స్.. ముగ్గురు ప్లేయర్స్ అరంగేట్రం!

Ashok Sharma Debut, Vaibhav Sooryavanshi Gets Chance. జింబాబ్వే, భారత్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ప్రారంభం అయింది.

Rishvik
Published on: 23 July 2026 4:50 PM IST
ZIM vs IND
X

ZIM vs IND: జింబాబ్వేతో తొలి టీ20.. బుడ్డోడికి ఛాన్స్.. ముగ్గురు ప్లేయర్స్ అరంగేట్రం!

ZIM vs IND: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జింబాబ్వే, భారత్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ప్రారంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ తరఫున ఫాస్ట్‌ బౌలర్ అశోక్ శర్మ అరంగేట్రం చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో జింబాబ్వే తరఫున న్యూమన్ న్యామ్హురి టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అలానే బెన్ కరన్ కూడా తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. దాంతో ఈ మ్యాచ్‌లో మొత్తంగా ముగ్గరు ప్లేయర్స్ అరంగేట్రం చేశారు.

హరారే పిచ్‌పై తనకు ఇదే తొలి మ్యాచ్ అని, పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో పూర్తిగా తెలియదని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. 'ప్రాక్టీస్ వికెట్లను పరిశీలిస్తే ఇక్కడ మంచి బౌన్స్ కనిపించింది. అందుకే ముందుగా బౌలింగ్ చేయడం సరైన నిర్ణయంగా భావించాను. జింబాబ్వే జట్టును తక్కువ అంచనా వేయలేము. గత కొన్నేళ్లుగా వారు మంచి క్రికెట్ ఆడుతున్నారు. ముఖ్యంగా టీ20 ప్రపంచ కప్‌ 2026లో వారి ప్రదర్శన ఆకట్టుకుంది. బ్యాటర్లు, బౌలర్లు తమ బలాలను సమర్థంగా వినియోగిస్తున్నారు. ఇక భారత్ ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతోంది' అని వెల్లడించాడు.

తొలి టీ20లో టీమిండియా తుది జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి అవకాశం లభించింది. అతడితో పాటు అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనున్నాడు. వికెట్‌కీపర్‌గా ఇషాన్ కిషన్, కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఆడుతారు. తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయనున్నారు. బౌలింగ్ విభాగంలో రవి బిష్ణోయ్‌తో పాటు ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్‌లకు చోటు దక్కింది. వరుస పరాజయాల నేపథ్యంలో భారత్ విజయం అందుకోవాలని చూస్తోంది.

మరోవైపు టాస్ ఓడిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా మాట్లాడుతూ.. హరారే పిచ్ సాధారణంగా ఉండే వికెట్ కాదని, ఆరంభంలో పేసర్లకు కొంత సహకారం లభించినా తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ పిచ్‌పై భారీ స్కోరు సాధించే అవకాశాలు ఉన్నాయని, ముందుగా బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని భావిస్తున్నట్లు తెలిపాడు.

ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఫలితాలు అనుకూలంగా రాకపోయినా జట్టులో ఎన్నో సానుకూల అంశాలు కనిపించాయని పేర్కొన్నాడు. బౌలింగ్ యూనిట్ అద్భుతంగా రాణించిందని, టాప్ ఆర్డర్ కూడా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసిందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో న్యూమన్ న్యామ్హురి టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేస్తున్నాడని, బెన్ కరన్ కూడా తొలి మ్యాచ్ ఆడుతున్నాడని రజా వెల్లడించాడు.

తుది జట్లు:

భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.

జింబాబ్వే: బ్రయాన్‌ బెనెట్, మరుమాని, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మద్వీర, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబాని.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story