ZIM vs IND 2nd T20: ఇషాన్, తిలక్ మెరుపు ఇన్నింగ్స్‌లు.. జింబాబ్వే ముందు వెరీ టఫ్ టార్గెట్!

Ishan Kishan 81, Tilak Varma 60 Power India to 219 Against Zimbabwe. జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లు చెలరేగారు.

Rishvik
Updated on: 25 July 2026 6:56 PM IST
ZIM vs IND 2nd T20
X

ZIM vs IND 2nd T20: ఇషాన్, తిలక్ మెరుపు ఇన్నింగ్స్‌లు.. జింబాబ్వే ముందు వెరీ టఫ్ టార్గెట్!

ZIM vs IND 2nd T20: జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది. వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (81) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (60 నాటౌట్) చివరి వరకు నిలిచి విధ్వంసకర బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇషాన్, తిలక్ మెరుపు ఇన్నింగ్స్‌లతో జింబాబ్వే ముందు 220 పరుగుల టఫ్ టార్గెట్ ఉంది.

ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ సరైన ఆరంభం అందించలేదు. అభిషేక్ 8 పరుగులు చేసి ముజారబాని బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. వైభవ్ కేవలం 9 బంతుల్లో 20 పరుగులు చేసి దూకుడుగా ఆడినా.. రిచర్డ్ నగరవ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. శ్రేయస్ 20 బంతుల్లో 25 పరుగులు చేసి బ్రియాన్ బెనెట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇషాన్ మాత్రం ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అద్భుతమైన టైమింగ్‌తో బౌండరీలు బాదుతూ 44 బంతుల్లో 81 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

ఇషాన్ కిషన్‌కు తిలక్ వర్మ మంచి సహకారం అందించాడు. ఇషాన్ అవుటైన తర్వాత తిలక్ ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నాడు. జింబాబ్వే బౌలర్లను ఓ ఆటాడుకుంటూ కేవలం 29 బంతుల్లోనే అజేయంగా 60 పరుగులు చేశాడు. తిలక్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. చివర్లో శివమ్ దూబే 3 బంతుల్లో 6 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో న్యూమన్ న్యామ్హురి పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. 3 ఓవర్లలో 25 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ముజారబాని, రిచర్డ్ నగరవ, బ్రాడ్ ఎవాన్స్, బ్రియాన్ బెనెట్ తలో వికెట్ తీశారు. కెప్టెన్ సికందర్ రజా నాలుగు ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.

మొదటి టీ20లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.. ఇప్పుడు మరోసారి భారీ స్కోరు నమోదు చేసి సిరీస్‌ను కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం జింబాబ్వేకు అంత సులభం కాదు. భారత బౌలింగ్ దళం తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో విజయంపై టీమిండియా నమ్మకంగా ఉన్నాడు. ఈ భారీ లక్ష్యాన్ని కాపాడుకుని సిరీస్‌ను సొంతం చేసుకోవాలని శ్రేయస్ అయ్యర్ సేన లక్ష్యంగా పెట్టుకుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story