ZIM vs IND 3rd T20: జింబాబ్వేతో మూడో టీ20.. అందుకే దూబే, ప్రిన్స్ యాదవ్‌ను తప్పించాం: శ్రేయస్ అయ్యర్!
India vs Zimbabwe 3rd T20 Playing 11. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరు ప్రారంభమైంది.
ZIM vs IND 3rd T20: జింబాబ్వేతో మూడో టీ20.. అందుకే దూబే, ప్రిన్స్ యాదవ్‌ను తప్పించాం: శ్రేయస్ అయ్యర్!
ZIM vs IND 3rd T20: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరు ప్రారంభమైంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండో టీ20 జరిగిన అదే పిచ్‌పై మ్యాచ్ జరగడంతో.. మ్యాచ్ సాగేకొద్దీ వికెట్ మరింత నెమ్మదించే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ సాబ్ తెలిపాడు.
టాస్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. 'రెండో మ్యాచ్‌లో భారత జట్టు 220 పరుగుల భారీ స్కోరు నమోదు చేసిన తీరు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈసారి కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలనుకుంటున్నాము. అందుకు పరిస్థితులకు వేగంగా అలవాటు పడటం చాలా ముఖ్యం. పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో ముందుగానే చెప్పలేము. బ్యాటర్లు పరిస్థితులకు తగ్గట్టుగా ఆడితే మరోసారి భారీ స్కోరు చేయగలమనే నమ్మకం ఉంది' అని చెప్పాడు.
ఈ మ్యాచ్ కోసం భారత్ జట్టు రెండు మార్పులు చేసింది. ప్రిన్స్ యాదవ్ స్థానంలో అశోక్ శర్మ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. అలాగే ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్థానంలో యువ ఆటగాడు సూర్యాంశ్ షెడ్గేకు అవకాశం దక్కింది. ప్రిన్స్ యాదవ్‌కు చిన్న గాయం అయిందని, సూర్యాంశ్ కోసం దూబేను ప్లేయింగ్ 11 నుంచి తప్పించాల్సి వచ్చిందని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించగా.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకూ సింగ్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నారు. బౌలింగ్ విభాగంలో మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
మరోవైపు జింబాబ్వే జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. గాయంతో రిచర్డ్ నగరవ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో వెల్లింగ్టన్ మసకద్జా జట్టులోకి వచ్చాడు. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని కెప్టెన్ సికందర్ రజా వెల్లడించాడు. జట్టు ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ కెప్టెన్‌గా తాను మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసి విజయంతో సిరీస్‌ను ముగించాలని తాము చూస్తున్నామని చెప్పాడు.
స్పిన్నర్లతో పాటు స్లోయర్ బంతులు వేసే పేసర్లకు కూడా ఇక్కడ మంచి సహకారం లభించే అవకాశముందది. ఈ వికెట్‌పై 180 పరుగులు పోటీ స్కోరు. మ్యాచ్‌ను భారత్ దూకుడుగా ఆరంభించింది. తొలి రెండు ఓవర్లలోనే 28 పరుగులు చేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 7 బంతుల్లో 11 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 2 బంతుల్లో 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సిరీస్‌లో మరోసారి భారీ స్కోరు సాధించి జింబాబ్వేపై క్లీన్‌స్వీప్ పూర్తి చేయాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.
తుది జట్లు:
భారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, సూర్యాంశ్ షెడ్గే, రింకు సింగ్, రవి బిష్ణోయ్, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్.
జింబాబ్వే: బ్రయాన్ బెనెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మద్వీర, మరుమాని, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, వెల్లింగ్టన్ మసకద్జ, బ్లెస్సింగ్ ముజరబాని.




