CWG 2026 India Medal Tally: కామన్వెల్త్‌ గేమ్స్‌లో బాక్సర్ల బంగారు జోరు.. భారత్‌కు 39 పతకాలు

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత బాక్సర్లు అదరగొట్టారు. 13 స్వర్ణాలతో భారత్‌ ఖాతాలో 39 పతకాలు చేరాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Aug 2026 4:00 AM IST
CWG 2026 India Medal Tally
X

CWG 2026 India Medal Tally

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. బాక్సింగ్‌ విభాగంలో స్వర్ణ పతకాల వర్షం కురిపించిన భారత ఆటగాళ్లు మొత్తం పతకాల సంఖ్యను 39కి చేర్చారు. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి.

బాక్సింగ్‌లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. భారత బాక్సర్లు మొత్తం 10 పతకాలు సాధించగా, మహిళల విభాగంలో ఏకంగా ఐదు స్వర్ణ పతకాలు దక్కాయి. పురుషుల విభాగంలో సచిన్‌ శివాచ్‌, అంకుష్‌ పంఘాల్‌ స్వర్ణాలు సాధించి భారత్‌కు మరింత గర్వకారణంగా నిలిచారు.

మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్‌, 57 కేజీల విభాగంలో జైస్మిన్‌ లంబోరియా, 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి, 60 కేజీల విభాగంలో ప్రియ ఘంఘాస్‌, 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి బంగారు పతకాలు సాధించారు.

ప్రపంచ ఛాంపియన్‌ జైస్మిన్‌ లంబోరియా, ఆసియా క్రీడల పతక విజేత ప్రీతి పవార్‌ తమ ఫైనల్‌ పోరులో ఆధిపత్యం ప్రదర్శించారు. ప్రీతి 54 కేజీల ఫైనల్‌లో కెనడాకు చెందిన స్కార్లెట్‌ డెల్గాడోపై 5-0తో విజయం సాధించగా, జైస్మిన్‌ ఉత్తర ఐర్లాండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మైఖేలా వాల్ష్‌ను ఓడించి స్వర్ణం అందుకుంది.

పురుషుల విభాగంలో సచిన్‌ శివాచ్‌ 60 కేజీల కేటగిరీలో, అంకుష్‌ పంఘాల్‌ 70 కేజీల విభాగంలో స్వర్ణాలు సాధించారు. సచిన్‌ ఉత్కంఠభరిత పోరులో నమీబియాకు చెందిన ట్రైఎగైన్‌ మార్నింగ్‌ న్డెవెలోపై 3-2తో గెలిచాడు. అంకుష్‌ ఇంగ్లండ్‌కు చెందిన డిమేజీ షిట్టుపై 4-1తో విజయం సాధించాడు.

అయితే ఒలింపిక్‌ పతక విజేత లవ్లీనా బోర్గోహెయిన్‌ 75 కేజీల ఫైనల్‌లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఎమ్మా స్యూ గ్రీన్‌ట్రీ చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. నరేందర్‌ బెర్వాల్‌, జడుమణి సింగ్‌ కూడా రజత పతకాలు సాధించారు.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో బాక్సింగ్‌లో భారత్‌ గత అత్యుత్తమ ప్రదర్శన 2018 గోల్డ్‌కోస్ట్‌ పోటీల్లో నమోదైంది. ఆ సమయంలో ఏడు పతకాలు సాధించిన భారత్‌, ప్రస్తుతం మరింత మెరుగైన ప్రదర్శనతో కొత్త రికార్డు సృష్టించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story