లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. ఇంగ్లండ్‌పై 270 పరుగుల భారీ తేడాతో విజయం!

India Women scripted history with 270-run victory over England Lord's. భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

Rishvik
Published on: 13 July 2026 6:58 PM IST
India Women
X

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. ఇంగ్లండ్‌పై 270 పరుగుల భారీ తేడాతో విజయం!

India Women: భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. క్రికెట్‌కు పుట్టినిల్లు, క్రికెట్‌ మక్కాగా పేరొందిన లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి మహిళల టెస్టు మ్యాచ్‌లో భారత్ జయకేతనం ఎగురవేసింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ను 270 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమిండియా చరిత్ర సృష్టించింది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లండ్‌ను 186 పరుగులకు ఆలౌట్ చేసిన హర్మన్‌ప్రీత్ సేన.. అరుదైన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 142 ఏళ్ల చరిత్రలో లార్డ్స్‌లో భారత్ సాధించిన ఈ విజయం మహిళల టెస్టు క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.

457 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. మూడో రోజు ముగిసే సమయానికి 130/6తో ఉన్న ఆతిథ్య జట్టు.. నాలుగో రోజు మరో 56 పరుగులు చేసి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. అమీ జోన్స్ హాఫ్ సెంచరీ (80 బంతుల్లో 54 )తో పోరాడగా.. సోఫీ ఎక్లెస్టోన్ (66 బంతుల్లో 50) అర్ధ శతకంతో ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ జట్టుకు పరాజయం తప్పలేదు.

భారత్ విజయంలో యువ పేసర్ క్రాంతి గౌడ్ కీలక పాత్ర పోషించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తన పేరును నమోదు చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్స్ తీసింది. సయాలి సాత్‌ఘరే కూడా అద్భుతమైన పేస్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టి రెండు వికెట్స్ ఖాతాలో వేసుకుంది. స్పిన్నర్ స్నేహ్ రాణా కీలక సమయంలో 4 వికెట్లు తీసి తీయగా.. సీనియర్ దీప్తి శర్మ చివరి రెండు వికెట్లను కూల్చి భారత విజయాన్ని ఖాయం చేసింది.

ఈ చారిత్రక విజయానికి భారత బ్యాటర్ల ప్రదర్శన కూడా ప్రధాన కారణం. మూడో రోజు స్మృతి మంధాన (70), యస్తిక భాటియా (113) అద్భుత ఆటతో భారీ స్కోరు నమోదు చేసి ఇంగ్లండ్ ముందు 457 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. తొలి ఇన్నింగ్స్‌లో స్మృతి 83 రన్స్ చేయగా.. హర్మన్‌ప్రీత్ (58), దీప్తి శర్మ (57)హాఫ్ సెంచరీలు బాదారు. సీమ్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత బ్యాటర్లు ఓర్పుతో ఆడగా.. ఇంగ్లండ్ బ్యాటర్లు మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయారు. ఈ విజయంతో మహిళల టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై భారత్ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. ఇరు జట్లు ఇప్పటివరకు 16 టెస్టుల్లో తలపడగా.. భారత్ నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. ఇంగ్లండ్ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించగా.. మిగిలిన 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇంగ్లండ్‌పై చివరిసారి 1995లో భారత్ టెస్టులో ఓడిపోయింది.

మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత జట్టును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా ప్రోత్సహించడం విశేషం. మ్యాచ్‌ను ఐసీసీ ఛైర్మన్ జయ్ షా కూడా స్టేడియంలో వీక్షించారు. విజయం అనంతరం సచిన్ భారత ఆటగాళ్లను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఈ మ్యాచ్ ఇంగ్లండ్ సీనియర్ ఆటగాళ్లు టామీ బీమాంట్, మాజీ కెప్టెన్ హీథర్ నైట్‌లకు వీడ్కోలు మ్యాచ్‌గా నిలిచింది.


Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story