IND vs AUS: ఆస్ట్రేలియాతో 'డూ ఆర్ డై' మ్యాచ్.. టీమిండియా ప్రపంచకప్ సెమీస్ చేరే సినారియోలు ఇవే!
IND vs AUS: India Women semi-final qualification scenarios. టీమిండియా మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 సెమీస్ చేరే నాలుగు సినారియోలు ఇవే.
IND vs AUS: ఆస్ట్రేలియాతో 'డూ ఆర్ డై' మ్యాచ్.. టీమిండియా ప్రపంచకప్ సెమీస్ చేరే సినారియోలు ఇవే!
IND vs AUS: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 కీలక దశకు చేరుకుంది. మెగా టోర్నీలో పాల్గొన్న 12 జట్లలో ఇప్పటికే నాలుగు జట్లు ఇంటిముఖం పట్టగా.. కేవలం ఒక్క జట్టు మాత్రమే అధికారికంగా సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం ఏకంగా ఏడు జట్లు పోటీ పడుతుండటంతో.. సమీకరణాలు ఉత్కంఠగా మారాయి.
ఈ నేపథ్యంలో గ్రూప్-A లో ఉన్న భారత మహిళల జట్టు సెమీస్ చేరాలంటే తదుపరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే చివరి మ్యాచ్‌లో తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది. లండన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత జట్టుకు మినీ క్వార్టర్ ఫైనల్‌గా మారింది.
గ్రూప్-ఏలో హోరాహోరీ పోటీ
గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. ఇందులో పాకిస్థాన్, నెదర్లాండ్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్, దక్షిణాఫ్రికా చెరో 6 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ 4 పాయింట్లతో ఇంకా రేసులో కొనసాగుతోంది. ఈ నాలుగు జట్లకు ఒక్కో లీగ్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండటంతో ప్రతి మ్యాచ్ ఫలితం సెమీస్ అవకాశాలను ప్రభావితం చేయనుంది.
భారత్ ఓడితే:
భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే.. ఆస్ట్రేలియా నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అలాంటి పరిస్థితిలో భారత జట్టు సెమీస్ చేరాలంటే దక్షిణాఫ్రికా తన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో తప్పనిసరిగా ఓడిపోవాలి. అప్పుడు భారత్, దక్షిణాఫ్రికా రెండూ 6 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఆ సమయంలో మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న జట్టుకు సెమీస్ బెర్తు దక్కుతుంది. అయితే బంగ్లాదేశ్ భారీ తేడాతో గెలిచి నెట్ రన్‌రేట్‌లో భారత్‌ను అధిగమించకుండా ఉండాలి.
భారత్ గెలిస్తే:
ఒకవేళ ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధిస్తే.. ఇరు జట్లూ 8 పాయింట్లతో నిలుస్తాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా కూడా బంగ్లాదేశ్‌పై గెలిస్తే.. ఆ జట్టుకూ 8 పాయింట్లు ఉంటాయి. అప్పుడు ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా మూడు జట్లలో మెరుగైన నెట్ రన్‌రేట్ కలిగిన తొలి రెండు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. కాబట్టి విజయం సాధించినా నెట్ రన్‌రేట్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
టీమిండియాకు కలిసొస్తున్న నెట్ రన్‌రేట్:
ప్రస్తుతం నెట్ రన్‌రేట్ విషయంలో భారత్ బలమైన స్థితిలో ఉంది. భారత నెట్ రన్‌రేట్ +2.268గా ఉండగా.. దక్షిణాఫ్రికా +0.734, బంగ్లాదేశ్ -0.849తో ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే.. భారత్, దక్షిణాఫ్రికా రెండూ తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోయినా.. నెట్ రన్‌రేట్ ఆధారంగా భారత్‌కు సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
గెలిస్తే టెన్షన్‌కు చెక్:
అయితే అన్ని సమీకరణాలకు చెక్ పెట్టాలంటే హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే ఉత్తమ మార్గం. బలమైన ప్రత్యర్థిపై గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవడమే భారత జట్టు ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ప్రస్తుతం అభిమానులందరి దృష్టి ఈ కీలక పోరుపైనే నిలిచింది.
గ్రూప్ బి నుంచి ఇంగ్లండ్:
గ్రూప్ బిలో ఇంగ్లండ్ (8) ఇప్పటికే సెమీస్‌కు చేరింది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆ జట్టుకు ఇబ్బందేమీ లేదు. రెండో బెర్తు కోసం వెస్టిండీస్ (6), శ్రీలంక (6), న్యూజిలాండ్ (4) రేసులో ఉన్నాయి. శ్రీలంక ఐదు మ్యాచులు ఆడేసింది. నేడు ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో విండీస్ గెలిస్తే.. ఆ జట్టే సెమీస్‌కు చేరుకుంటుంది. అప్పుడు మిగతా టీమ్స్ ఇంటికి వెళ్లాల్సిందే.




