CWG 2026 Boxing: బాక్సర్ల బంగారు పంచ్‌.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు చారిత్రక ఘనత

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత బాక్సర్లు చరిత్ర సృష్టించారు. 7 స్వర్ణాలు, 3 రజతాలతో 10 పతకాలు సాధించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Aug 2026 4:20 AM IST
CWG 2026 Boxing
X

CWG 2026 Boxing

CWG 2026 Boxing : కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత బాక్సర్లు చరిత్ర సృష్టించారు. బాక్సింగ్‌ విభాగంలో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తూ మొత్తం 10 పతకాలు సాధించింది. ఇందులో 7 స్వర్ణాలు, 3 రజత పతకాలు ఉన్నాయి.

మహిళల విభాగంలో భారత బాక్సర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ఐదు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ప్రపంచ ఛాంపియన్‌ జైస్మిన్‌ లంబోరియా (57 కేజీలు), ఆసియా క్రీడల పతక విజేత ప్రీతి పవార్‌ (54 కేజీలు), ఆసియా ఛాంపియన్‌ ప్రియ ఘంఘాస్‌ (60 కేజీలు), సాక్షి చౌదరి (51 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు) బంగారు పతకాలు గెలిచారు.

పురుషుల విభాగంలో సచిన్‌ శివాచ్‌ (60 కేజీలు), అంకుష్‌ పంఘాల్‌ (70 కేజీలు) స్వర్ణాలు సాధించారు. సచిన్‌ ఉత్కంఠభరిత పోరులో నమీబియాకు చెందిన ట్రైఎగైన్‌ మార్నింగ్‌ న్డెవెలోపై 3-2తో విజయం సాధించాడు. అంకుష్‌ పంఘాల్‌ ఇంగ్లండ్‌ బాక్సర్‌ డిమేజీ షిట్టును 4-1తో ఓడించి స్వర్ణం అందుకున్నాడు.

ఒలింపిక్‌ పతక విజేత లవ్లీనా బోర్గోహెయిన్‌ (75 కేజీలు) ఫైనల్‌లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఎమ్మా స్యూ గ్రీన్‌ట్రీ చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. పురుషుల విభాగంలో జడుమణి సింగ్‌ (55 కేజీలు), నరేందర్‌ బెర్వాల్‌ (+90 కేజీలు) కూడా రజత పతకాలు సాధించారు.

గతంలో కామన్వెల్త్‌ గేమ్స్‌లో బాక్సింగ్‌లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన 2018 గోల్డ్‌కోస్ట్‌ పోటీల్లో నమోదైంది. అప్పట్లో ఏడు పతకాలు సాధించిన భారత్‌, ఇప్పుడు 10 పతకాలతో తన రికార్డును అధిగమించింది.

భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శనతో గ్లాస్గో వేదికగా జరిగిన పోటీల్లో భారత అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. "భారత్‌ మాతా కీ జై", "ఇండియా.. ఇండియా" నినాదాలతో ఎస్‌ఈసీ అరేనా మార్మోగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story