IND vs AUS: టీమిండియాకు అదే పెద్ద తలనొప్పి.. టీ20 ప్రపంచకప్‌లో భారీ మూల్యం చెల్లించక తప్పదు!

IND vs AUS: India Women face poor fielding ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు కీలక పోరుకు సిద్దమైంది.

Rishvik
Published on: 27 Jun 2026 6:51 PM IST
IND vs AUS
X

IND vs AUS: టీమిండియాకు అదే పెద్ద తలనొప్పి.. టీ20 ప్రపంచకప్‌లో భారీ మూల్యం చెల్లించక తప్పదు!

IND vs AUS: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు కీలక పోరుకు సిద్దమైంది. సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే చివరి గ్రూప్-ఏ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. లండన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత జట్టుకు క్వార్టర్ ఫైనల్‌ లాంటిది అనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే.. భారత్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అప్పుడు మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

గ్రూప్-ఏలో ప్రస్తుతం ఆస్ట్రేలియా నాలుగు విజయాలతో 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్, దక్షిణాఫ్రికా చెరో 6 పాయింట్లతో తర్వాతి ఉన్నాయి. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే.. భారత్‌ సెమీస్ చేరాలంటే ఆస్ట్రేలియాను ఓడించడం తప్ప మరో మార్గం ఉండదు. ఒకవేళ బంగ్లాదేశ్ అనూహ్యంగా దక్షిణాఫ్రికాను ఓడిస్తే.. భారత్ ఓడినా నెట్‌రన్‌రేట్ ఆధారంగా సెమీస్ అవకాశాలు ఉండొచ్చు. అన్ని సమీకరణాలకు చెక్ పెట్టాలంటే.. హర్మన్‌ప్రీత్ సేన ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే ఉత్తమ మార్గం. పటిష్ట ఆస్ట్రేలియాపై విజయం అంటే మాటలు కాదు. ఓ తప్పిదం కూడా చేయకూడదు. అయితే టీమిండియాకు రెండు సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఆ రెండింటిని అధిగమించకపోతే టీ20 ప్రపంచకప్‌లో భారీ మూల్యం చెల్లించక తప్పదు.

మిడిల్ ఆర్డర్ వైఫల్యం:

మెగా టోర్నీలో భారత జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ప్రారంభంలో ఓపెనర్ల ఫామ్ ఆందోళన కలిగించినప్పటికీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. స్మృతి మంధాన (167 పరుగులు), షెఫాలీ వర్మ (145 పరుగులు) మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఒకరు ధాటిగా ఆడుతూ పరుగులు చేస్తున్నారు. అయితే కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (58), హర్మన్‌ప్రీత్ కౌర్ (85) నిరాశపర్చుతున్నారు. యాషిక భాటియా కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు. మిడిల్ ఆర్డర్ వైఫల్యం విజయాలపై ప్రభావం చూపుతోంది.

దారుణమైన ఫీల్డింగ్:

బ్యాటింగ్ సమస్యలతో పాటు ఫీల్డింగ్ కూడా భారత జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. గత రెండు మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు మొత్తం ఆరు సునాయాస క్యాచ్‌లు వదిలేశారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఈ తప్పిదాలే ఓటమికి కారణం అయ్యాయి. బంగ్లాదేశ్‌పై నాలుగు క్యాచ్‌లు వదిలినా అదృష్టవశాత్తూ విజయం సాధించింది. అయితే ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై ఇలాంటి పొరపాట్లు చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

చరణిపై భారీ ఆశలు

భారత బౌలింగ్ విభాగంలో ఎడమచేతి స్పిన్నర్ శ్రీ చరణి అద్భుత ఫామ్‌లో ఉంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసి జట్టు ప్రధాన ఆయుధంగా నిలిచింది. అయితే మిగతా బౌలర్లు కూడా ఆమెకు సహకరించాల్సిన అవసరం ఉంది. దీప్తి శర్మ, షఫాలీ వర్మలు పర్వాలేదనిపిస్తున్నారు. రేణుక సింగ్ ఠాకూర్, నందిని శర్మ వికెట్స్ తీయాల్సి ఉంది. బౌలింగ్ యూనిట్ సమష్టిగా రాణిస్తేనే ఆస్ట్రేలియా బలమైన బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేయడం సాధ్యమవుతుంది.

పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా:

ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీఫైనల్‌కు అడుగు దూరంలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడినా మెరుగైన నెట్‌రన్‌రేట్ కారణంగా తదుపరి దశకు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా గాయంతో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన ఫోబీ లిచ్‌ఫీల్డ్ ఈ మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముండటం ఆసీస్‌కు మరింత బలాన్నిస్తుంది. అయితే గత ఏడాది వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరిన జ్ఞాపకం టీమిండియాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. అదే పోరాటస్ఫూర్తిని మరోసారి ప్రదర్శిస్తేనే భారత్ సెమీస్ ఆశలను నిలబెట్టుకోగలదు. ప్రస్తుతం భారత మహిళల జట్టుకు ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story