WTC 2025-27: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు ముగిసినట్టే.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

akash Chopra on India's WTC 2025-27 final hopes. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా డబ్ల్యూటీసీ 2025-27 ఫైనల్ రేసులో భారత్ అవకాశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Rishvik
Published on: 5 Aug 2026 5:31 PM IST
WTC 2025-27
X

WTC 2025-27: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు ముగిసినట్టే.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

WTC 2025-27: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగష్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. ఆగస్టు 15న గాలెలో తొలి టెస్టు, ఆగస్టు 23న కొలంబోలో రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 ఫైనల్ రేసులో నిలవాలంటే.. టీమిండియా సిరీస్‌లో గెలవడం తప్పనిసరి. ఒక్క మ్యాచ్ ఓడినా డబ్ల్యూటీసీ పాయింట్లపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్ భారత్‌కు అత్యంత కీలకమని, ఈ సిరీస్‌లో ఫలితం జట్టు భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం చాలా కష్టమని ఆకాశ్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, నాలుగు పరాజయాలతో 48.15 శాతం పాయింట్లతో ఉంది. మరోవైపు శ్రీలంక ఒక విజయం, ఒక ఓటమి, రెండు డ్రాలతో 41.67 శాతం పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. 'భారత్ ఈ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోతే పాయింట్ల శాతం 39కు పడిపోతుంది. అదే సమయంలో శ్రీలంక 61 శాతం పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుని డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో బలమైన పోటీదారుగా మారుతుంది. అయితే శ్రీలంక 2-0తో సిరీస్ గెలిస్తేనే వారికి ఫైనల్ అవకాశాలు బలపడతాయి. లేకపోతే మరోసారి ఫైనల్‌కు చేరువలోనే ఆగిపోవాల్సి వస్తుంది' అని చెప్పాడు.

'భారత్ 2-0తో శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేస్తే పాయింట్ల శాతం 57.58కి చేరుతుందది. అయితే సిరీస్ 1-1తో డ్రాగా ముగిస్తే భారత్ పాయింట్ల శాతం కేవలం 48.48గా ఉంటుంది. శ్రీలంక 44.44 శాతంతోనే కొనసాగుతుంది. అప్పుడు ఇరు జట్ల స్థానాల్లో పెద్దగా మార్పు ఉండదు. భారత్‌కు ముందున్న షెడ్యూల్ చాలా కఠినంగా ఉంది. శ్రీలంక సిరీస్ అనంతరం నవంబర్-డిసెంబర్‌లో న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్ట్‌లు టీమిండియా ఆడుతుంది. ఆ తర్వాత 2027 జనవరి నుంచి మార్చి వరకు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఓడినా పాయింట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. 1-2 టెస్టులు ఓడితే భారత్ ఆశలు వదిలేసుకోవాల్సిందే' అని ఆకాశ్ చోప్రా వివరించాడు.

న్యూజిలాండ్‌లో భారత్‌కు చారిత్రాత్మకంగా మంచి రికార్డు లేదని కూడా ఆకాశ్ చోప్రా చెప్పాడు. 2008-09లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో సిరీస్ గెలిచిన తర్వాత అక్కడ మరోసారి టెస్ట్ సిరీస్ విజయాన్ని భారత్ నమోదు చేయలేదని గుర్తు చేశాడు. స్వదేశంలోనూ ఇటీవలి కాలంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఎదురైన పరాజయాలు భారత్‌కు హెచ్చరికలుగా మారాయని పేర్కొన్నాడు. శ్రీలంక పర్యటన కూడా అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై భారత బ్యాటర్లు ఇటీవల ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఈ సిరీస్‌లో టీమిండియాకు విజయం అంత ఈజీ కాదంటున్నారు. ఈ పరిస్థితుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంక పర్యటనలో భారత్ తప్పనిసరిగా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story