IPL 2026-BCCI: స్టార్ ప్లేయర్‌పై బీసీసీఐ నిఘా.. రాత్రిళ్లు గదిలోకి అతిథులు.. ఇంతకీ ఏం జరిగింది?

BCCI ACU Monitoring Players Activities. ఐపీఎల్ 2026లో ఆటగాళ్ల ప్రవర్తన, భద్రతా నిబంధనల అమలుపై బీసీసీఐ కఠినంగా వ్యవహరిస్తోంది.

Rishvik
Published on: 9 May 2026 7:15 PM IST
IPL 2026  BCCI ACU Monitoring Star Player Over Late-Night Hotel Visitors
X

IPL 2026 BCCI ACU Monitoring Star Player Over Late-Night Hotel Visitors

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఆటగాళ్ల ప్రవర్తన, భద్రతా నిబంధనల అమలుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) ఆటగాళ్ల హోటల్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ స్టార్ ప్లేయర్ తరచూ అర్ధరాత్రి వరకు తన హోటల్ గదిలో కొంతమందిని కలుస్తున్నాడనే సమాచారం బీసీసీఐ ఏసీయూకు చేరినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటన ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నివేదికల ప్రకారం.. సదరు ఆటగాడు తన గదిలో రాత్రి వేళల్లో అతిథులను కలుస్తుండటాన్ని ఓ ఏసీయూ అధికారి గమనించాడు. ఆ అధికారి వెంటనే ఆటగాడి ప్రాంచైజీ మేనేజర్‌ను పిలిచి వివరణ కోరాడు. ఆ సమయంలో టీమ్ మేనేజర్ స్పందన నిర్లక్ష్యంగా ఉందని సమాచారం. సదరు ఆటగాడు జట్టులో సీనియర్ కావడంతో కొంత స్వేచ్ఛ ఉంటుందని సమర్థించాడట. దీనిపై ఒక మాజీ ఐపీఎల్ టీమ్ మేనేజర్ మాట్లాడుతూ.. ‘కొంతమంది స్టార్ ప్లేయర్లు తమ స్థాయిని ఉపయోగించి నిబంధనలను అతిక్రమించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి నేను ఓ ఆటగాడికి స్నేహితులను గదిలో కాకుండా హోటల్ లాబీలో కలవమని చెప్పాను. కానీ అతడు బీసీసీఐ బోర్డు అడిగితే నేనే చెప్పుకుంటా అంటూ సమాధానం ఇచ్చాడు’ అని వెల్లడించాడు.

మరో ఫ్రాంచైజీ అధికారి కూడా ఈ అంశంపై స్పందించాడు. ‘ఇప్పుడు మేము ఆటగాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను హోటల్‌కు పిలవాలంటే ముందుగా మేనేజ్‌మెంట్ అనుమతి తప్పనిసరి. రాత్రి 10 గంటల తర్వాత అతిథులను కలవకూడదు. కలిసినా లాబీ లేదా పబ్లిక్ ప్లేస్‌లో మాత్రమే కలవాలి’ అని తెలిపాడు. ఇంకో ఘటనలో ఓ ఆటగాడు జట్టు అధికారుల ఫోన్ కాల్స్‌కు స్పందించలేదని సమాచారం. అతడి గది తలుపు తట్టినా స్పందన రాకపోవడంతో అధికారులు ఆందోళన చెందారట. చివరకు ఆ ఆటగాడు అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది స్నేహితులతో కలిసి హోటల్‌కు వచ్చాడని తెలుస్తోంది. అయితే అతడు ఫ్రాంచైజీ యాజమాన్యానికి దగ్గరగా ఉండటంతో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని కథనాలు పేర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో బీసీసీఐ, ఫ్రాంచైజీలు కలిసి కొత్త మార్గదర్శకాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఆటగాళ్ల గోప్యతకు భంగం కలగకుండా, అదే సమయంలో అవినీతి నిరోధక నిబంధనలు కచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ వంటి భారీ టోర్నీల్లో భద్రతా ప్రమాణాలు, యాంటీ కరప్షన్ నిబంధనలు ఎంత కీలకమో మరోసారి ఈ ఘటనతో చర్చకు వచ్చాయి. ప్లేయర్స్, సిబ్బంది హానీ ట్రాప్ వలలో పడకుండా బీసీసీఐ ఇటీవల కఠిన నిబంధనలు అమలు చేసిన విషయం తెలిసిందే.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story