IPL 2026: ఐపీఎల్ ప్లేయ‌ర్స్ వారితో సంబంధాలు పెట్టుకోవద్దు.. బీసీసీఐ కీల‌క హెచ్చ‌రిక‌

IPL 2026: ఐపీఎల్‌ ప్రస్తుత సీజన్‌లో భద్రత, క్రమశిక్షణ అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న బీసీసీఐ కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది.

Mokshith
Published on: 9 May 2026 1:31 PM IST
IPL 2026
X

IPL 2026

IPL 2026: ఐపీఎల్‌ ప్రస్తుత సీజన్‌లో భద్రత, క్రమశిక్షణ అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న బీసీసీఐ కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, జట్టు అధికారుల హోటల్ గదుల్లోకి అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించకుండా కఠిన ఆంక్షలు విధించింది. ఇటీవల కొన్ని సంఘటనలు బోర్డు దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అనధికార అతిథులపై పూర్తి నిషేధం

ఇకపై ఐపీఎల్‌కు సంబంధించిన హోటళ్లలో ఉండే ఆటగాళ్ల గదుల్లోకి ఎవరికైనా ప్రవేశం కల్పించాలంటే ముందుగా జట్టు మేనేజ్‌మెంట్ నుంచి లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. స్నేహితులు, పరిచయస్తులు లేదా ఇతర అతిథులు నేరుగా గదులకు వెళ్లే అవకాశాన్ని పూర్తిగా నిలిపివేసింది బీసీసీఐ. ఈ నిర్ణయం అన్ని ఫ్రాంచైజీలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఏసీయూ నివేదికల తర్వాత బీసీసీఐ అప్రమత్తం

ఈ సీజన్‌లో కొన్ని ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగినట్లు బోర్డు అవినీతి నిరోధక విభాగం గుర్తించింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రమేయంతో జరిగిన కొన్ని ఘటనలు భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై సమీక్ష నిర్వహించిన తర్వాతే బీసీసీఐ మరింత కఠిన చర్యలకు సిద్ధమైంది.

ఫ్రాంచైజీలకు దేవజిత్ సైకియా లేఖలు

ఐపీఎల్‌లో పాల్గొంటున్న 10 ఫ్రాంచైజీల సీఈఓలకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రత్యేక లేఖలు పంపారు. టోర్నీ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఒక జట్టు చేసిన తప్పు మొత్తం లీగ్ ప్రతిష్ఠపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు.

హనీట్రాప్ ముప్పుపై ప్రత్యేక హెచ్చరిక

క్రీడాకారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హనీట్రాప్ ఘటనలపై కూడా బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఆటగాళ్లు అనుమానాస్పద వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవద్దని ఫ్రాంచైజీలకు సూచించింది. ముఖ్యంగా హోటల్ వసతి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భద్రతా విభాగం అనుమతి లేకుండా ఎవరితో సమావేశాలు నిర్వహించొద్దని హెచ్చరించింది.

రాత్రివేళ బయటకు వెళ్లడంపైనా ఆంక్షలు

ఆటగాళ్లు లేదా సిబ్బంది హోటల్ వెలుపలికి వెళ్లాలంటే ముందుగా సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ లేదా టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్‌కు సమాచారం ఇవ్వాల్సిందే. ముఖ్యంగా రాత్రివేళల్లో అనుమతి లేకుండా బయటకు వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించింది. నిబంధనలు అమల్లో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి బీసీసీఐ లేదా ఐపీఎల్ ఆపరేషన్స్ టీమ్ ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ చర్యలు

కొత్త మార్గదర్శకాలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ హెచ్చరించింది. భారీ జరిమానాలు, సస్పెన్షన్‌తో పాటు అవసరమైతే టోర్నీ నుంచి తొలగించే అవకాశమూ ఉందని స్పష్టం చేసింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరూ వృత్తిపరమైన ప్రవర్తన పాటించాలని బోర్డు సూచించింది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story