IPL 2026: ఇదెక్కడి దరిద్రం బాసూ.. ఐపీఎల్ 2026 వింత రికార్డు..!

IPL 2026: ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారుతోంది. కేవలం రెండు రోజుల్లో సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, వైభవ్ సూర్యవంశీ అద్భుత సెంచరీలు చేసినా వారి జట్లు ఓటమి పాలయ్యాయి.

Naresh.k
Published on: 26 April 2026 9:28 AM IST
IPL 2026
X

IPL 2026: ఇదెక్కడి దరిద్రం బాసూ.. ఐపీఎల్ 2026 వింత రికార్డు..!

Srh vs Rr: ఐపీఎల్‌లో సెంచరీలు నమోదవ్వడం అంటే అది ఆ బ్యాటర్ వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, జట్టు విజయానికి బలమైన సంకేతం అనుకుంటాం. కానీ ఐపీఎల్ 2026లో సీన్ రివర్స్ అయ్యింది. ఒకే రెండు రోజుల్లో నమోదైన మూడు అద్భుతమైన సెంచరీలు జట్లకు కనీసం విజయాన్ని కూడా అందించలేకపోయాయి. శతక వీరుల కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.

సాయి సుదర్శన్ క్లాస్ ఇన్నింగ్స్.. కోహ్లీ సేన మాస్ విక్టరీ

శుక్రవారం గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన పోరులో సాయి సుదర్శన్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. కేవలం 58 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. గుజరాత్ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, ఆర్సీబీ లెక్క వేరేలా ఉంది. విరాట్ కోహ్లీ తనదైన శైలిలో 81 పరుగులు చేసి పునాది వేయగా, మిగిలిన ఆటగాళ్లు సమిష్టిగా రాణించి సుదర్శన్ సెంచరీని ఓటమి పాలు చేశారు.

కేఎల్ రాహుల్ సంచలన ఇన్నింగ్స్.. పంజాబ్ కింగ్స్ ఛేజింగ్ మ్యాజిక్

శనివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 152 పరుగులతో టీ20 చరిత్రలో ఒక మైలురాయిని దాటాడు. ఢిల్లీ స్కోరును 265 పరుగుల భారీ స్థాయికి తీసుకెళ్లాడు. ఇంత పెద్ద స్కోరును ఛేజ్ చేయడం అసాధ్యమని భావించిన తరుణంలో, పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు సింహాల్లా గర్జించారు. ఏకంగా 265 పరుగుల టార్గెట్‌ను కూడా అలవోకగా ఊదిపారేసి, రాహుల్ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌ను విషాదంలో ముంచారు.

సూర్యవంశీ మెరుపులు.. సన్‌రైజర్స్ జోరు

అదే శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 37 బంతుల్లోనే 12 సిక్సర్లతో 103 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే ఒక సెన్సేషన్ సృష్టించాడు. రాజస్థాన్ 228 పరుగుల భారీ స్కోరు సాధించినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏమాత్రం తగ్గలేదు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీలతో విరుచుకుపడి సన్‌రైజర్స్‌కు అద్భుత విజయాన్ని అందించారు.

ఒకప్పుడు టి20ల్లో సెంచరీ అంటే విజయం ఖాయమనే నమ్మకం ఉండేది. కానీ ఐపీఎల్ 2026లో బ్యాటర్ల జోరు, పిచ్‌ల స్వభావం చూస్తుంటే.. ఇప్పుడు సెంచరీ బాదినా, 250 పరుగులు చేసినా విజయంపై నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. కేవలం ఒక్కరిపైనే ఆధారపడకుండా సమిష్టిగా రాణించిన జట్టునే విజయం వరిస్తుందని ఈ మూడు మ్యాచ్‌లు నిరూపించాయి. ఏది ఏమైనా, ఈ వింత ఫలితాలు క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత మజాను అందిస్తున్నాయి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story