IPL 2026: చెపాక్‌లో సీఎస్‌కే ఊచకోత..పాయింట్ల పట్టికలో పైకి జంప్
IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
IPL 2026: చెపాక్‌లో సీఎస్‌కే ఊచకోత..పాయింట్ల పట్టికలో పైకి జంప్
CSK vs KKR: ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు తన పాత వైభవాన్ని గుర్తు చేస్తోంది. సీజన్ ఆరంభంలో వరుసగా మూడు ఓటములతో డీలా పడ్డ అభిమానులకు ఊపిరి పోస్తూ, వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం చెపాక్ వేదికగా జరిగిన 22వ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 32 పరుగుల తేడాతో చిత్తు చేసి, ప్లే-ఆఫ్ రేసులోకి రీ-ఎంట్రీ ఇచ్చింది.
బ్యాటర్ల వీరవిహారం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే, చెపాక్ పిచ్‌పై పరుగుల వరద పారించింది. నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోరు సాధించి కేకేఆర్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం ఛేదనలో కేకేఆర్‌ను కేవలం 160 పరుగులకే కట్టడి చేసి, బౌలింగ్‌లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ విజయంతో రుతురాజ్ గైక్వాడ్ సేన కాన్ఫిడెన్స్ లెవల్స్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
పాయింట్ల పట్టికలో ఎక్కడ ఎవరున్నారు?
ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో ఒక మెట్టు ఎక్కి 8వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు సాధించింది. అయితే, నెట్ రన్ రేట్ (-0.846) మైనస్‌లో ఉండటం జట్టును కాస్త కలవరపెడుతోంది. మరోవైపు కేకేఆర్ పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా లేక, కేవలం ఒక పాయింట్‌తో టేబుల్ అడుగున (10వ స్థానం) నిలిచింది.
టాప్-5 టీమ్స్ ఇవే
రాజస్థాన్ రాయల్స్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ 7 పాయింట్లతో రెండో స్థానం, ఆర్సీబీ 6 పాయింట్లతో మూడో స్థానం, సన్ రైజర్స్ హైదరాబాద్ 4 పాయింట్లతో నాలుగో స్థానం, ఢిల్లీ, గుజరాత్, లక్నోజట్లు తలో 4 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
వరుస ఓటములతో కుంగిపోయిన చోట నుండే సీఎస్‌కే మళ్ళీ పుంజుకుంది. అయితే ప్లే-ఆఫ్ చేరాలంటే రాబోయే మ్యాచ్‌ల్లో కేవలం గెలవడమే కాదు, రన్ రేట్‌ను కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. అటు కోల్‌కతా మాత్రం ఇకనైనా గెలుపు బాట పట్టకపోతే ఈ సీజన్ నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయం.




