IPL 2026 Final: అతడు 3 ఓవర్లు వేస్తే ఆర్సీబీ పని అయిపోయినట్టే.. భారత మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్!

Kris Srikkanth Warns RCB Ahead of GT Final. ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ముందు మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rishvik
Published on: 31 May 2026 6:46 PM IST
IPL 2026 Final
X

IPL 2026 Final: అతడు 3 ఓవర్లు వేస్తే ఆర్సీబీ పని అయిపోయినట్టే.. భారత మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్!

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్‌కు ముందు మాజీ భారత కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొద్దిసేపట్లో అహ్మదాబాద్‌లోని ఐకానిక్ నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ (జీటీ)తో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రొమారియో షెపర్డ్‌ను తుది జట్టులోకి తీసుకోవద్దని సూచించారు. షెపర్డ్ బౌలింగ్‌పై తీవ్ర సందేహాలు వ్యక్తం చేసిన శ్రీకాంత్.. అతడు మూడు ఓవర్లు బౌలింగ్ చేస్తే ఆర్సీబీ ఓటమి ఖాయమని అభిప్రాయపడ్డారు.

షెపర్డ్ ఆడితే ఆర్సీబీకి ప్రమాదమే:

తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన క్రిస్ శ్రీకాంత్.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ బంతితో ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదని పేర్కొన్నారు. షెపర్డ్ 7 వికెట్లు తీసినప్పటికీ.. అతని ఎకానమీ రేటు 12కు పైగా ఉండటం ఆందోళనకరమని అన్నారు. 'ఆర్సీబీ ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ఒక్కటే కారణం ఉంది. రొమారియో షెపర్డ్ మూడు ఓవర్లు బౌలింగ్ చేస్తే బెంగళూరు పని అయిపోయినట్టే. అందుకే అతడితో బౌలింగ్ చేయించకూడదు. సాధ్యమైతే తుది జట్టులో కూడా చోటివ్వకూడదు' అని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు.

ఫిల్ సాల్ట్ స్థానంపై కీలక సూచన:

ఫిల్ సాల్ట్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాలేదన్న శ్రీకాంత్.. ప్రస్తుతం జట్టులో ఉన్న వెంకటేశ్ అయ్యర్‌ను కొనసాగించాలని సూచించారు. సాల్ట్ అందుబాటులోకి వచ్చినా.. మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. గుజరాత్ టైటాన్స్ విజయం సాధించాలంటే.. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ మధ్య భాగస్వామ్యాన్ని త్వరగా విచ్ఛిన్నం చేయాలని శ్రీకాంత్ అన్నారు. ఈ ఇద్దరూ ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నారని, ఈ ఇద్దరి భాగస్వామ్యమే ఆర్సీబీ విజయాలకు కారణమని చెప్పారు. 'విరాట్ కోహ్లీ 40 పరుగులు చేసినా ఆర్సీబీ చాలా మ్యాచ్‌లు గెలిచింది. కానీ పడిక్కల్‌తో కోహ్లీ నెలకొల్పే భాగస్వామ్యం చాలా కీలకం. ఈ ఇద్దరిలో ఒకరు త్వరగా అవుట్ అయితేనే ఆర్సీబీ ఒత్తిడిలో పడుతుంది' అని వివరించారు.

జీటీ విజయానికి ముగ్గురు కీలకం:

గుజరాత్ టైటాన్స్ ఫైనల్ గెలవాలంటే విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్‌లలో కనీసం ఇద్దరిని త్వరగా ఔట్ చేయాల్సిందేనని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. 'కోహ్లీ, పడిక్కల్, పాటీదార్‌లలో ఇద్దరు క్లిక్ అయితే ఆర్సీబీ విజయం ఖాయం. అందుకే గుజరాత్ విజయం సాధించాలంటే.. ఈ ముగ్గురిలో కనీసం ఇద్దరిని ప్రారంభంలోనే పెవిలియన్‌కు పంపాలి. అలాగే కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్ జోడి అద్భుతంగా బౌలింగ్ చేయాలి' అని శ్రీకాంత్ విశ్లేషించారు.

ఫైనల్‌లో వ్యూహాలే కీలకం:

ఆర్సీబీ-జీటీ ఫైనల్‌లో స్టార్ బ్యాటర్లతో పాటు బౌలర్ల పాత్ర కూడా కీలకంగా మారనుంది. ముఖ్యంగా పవర్‌ప్లేలో వికెట్లు తీసే జట్టు మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే రబాడా, సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్ వంటి పేసర్ల ప్రదర్శన ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ నలుగురు అద్భుత ఫామ్ మీదున్న విషయం తెలిసిందే. మరి ఫైనల్ రోజు ఎవరిది అవుతుందో చూడాలి. ప్రస్తుతం భారత మాజీ కెప్టెన్ అండ్ కోచ్ క్రిస్ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story