IPL 2026 Final RCB vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
IPL 2026 Final RCB vs GT. ఆదివారం ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తికాకపోతే.. సోమవారం రిజర్వ్ డేలో కొనసాగుతుంది.
IPL 2026 Final RCB vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
IPL 2026 Final RCB vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రసవత్తర పోరుకు తెరలేవనుంది. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ విజేత గుజరాత్ టైటాన్స్ (జీటీ) టైటిల్ కోసం తలపడనున్నాయి. తమ ఖాతాలో రెండో ఐపీఎల్ ట్రోఫీని వేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలి టైటిల్ గెలిచిన ఆర్సీబీ.. ఇప్పుడు వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాలని చూస్తోంది. 2022లో అరంగేట్ర సీజన్లోనే కప్పు గెలిచిన గుజరాత్.. ఐదేళ్లలో మూడోసారి ఫైనల్‌కు చేరి, మరోసారి ఐపీఎల్ రారాజుగా నిలవాలని భావిస్తోంది.
ఫైనల్‌కు వర్షం ముప్పు?:
వాతావరణ నివేదికల ప్రకారం.. అహ్మదాబాద్‌లో మ్యాచ్ రోజు వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మ్యాచ్ జరిగే సమయంలో 30 శాతం వర్ష సూచన ఉండగా.. మేఘావృత పరిస్థితులు 15 శాతం మేర మాత్రమే ఉన్నాయి. ఉత్తర-పశ్చిమ భారతదేశంలో భారీ వర్షాలు కురిసినా.. ఈరోజు అహ్మదాబాద్‌లో వాతావరణం మ్యాచ్‌కు అనుకూలంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒకవేళ వర్షం పడితే?:
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లోని క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేనప్పటికీ.. ఫైనల్‌కు మాత్రం బీసీసీఐ ప్రత్యేకంగా రిజర్వ్ డేను కేటాయించింది. ఈరోజు మ్యాచ్ నిర్వహించేదుకు అన్ని అవకాశాలను అంపైర్లు చూస్తారు. ఓవర్లు కుదించి అయినా మ్యాచ్ నిర్వహిస్తారు. మ్యాచ్‌ను కనీసం 5 ఓవర్లకు కుదించి నిర్వహించాలంటే.. కటాఫ్ టైం రాత్రి 11:45 గంటలు. ఒకవేళ 5 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాకపోతే.. అర్ధరాత్రి 12:50 గంటల లోపు కనీసం 'సూపర్ ఓవర్' ద్వారా విజేతను తేల్చేందుకు అంపైర్లు ప్రయత్నిస్తారు. అప్పటికి కూడా వాతావరణం సహకరించకపోతే మ్యాచ్ రిజర్వ్ డేకు మారుతుంది.
రిజర్వ్ డే నిబంధనలు ఇలా:
ఆదివారం మ్యాచ్ వర్షం కారణంగా పూర్తికాకపోతే.. సోమవారం రిజర్వ్ డేలో కొనసాగుతుంది. ఆదివారం మ్యాచ్ ఎక్కడైతే ఆగిపోయిందో (అదే స్కోరు, అదే ఓవర్, అదే బంతి నుంచి) సోమవారం ఆటను అక్కడి నుంచే పునఃప్రారంభిస్తారు. మ్యాచ్‌ను తిరిగి మొదటి నుంచి నిర్వహించరు. ఒకవేళ ఆదివారం మాత్రమే కాకుండా, రిజర్వ్ డే అయిన సోమవారం కూడా వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా నిలుస్తుంది.
అగ్రస్థానంలో ఆర్సీబీ:
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం అస్సలు సాధ్యం కాకపోతే, లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో ఏ జట్టు అయితే మెరుగైన స్థానంలో (టాప్ ప్లేస్) ఉంటుందో ఆ జట్టునే విజేతగా ప్రకటిస్తారు. లీగ్ స్టేజ్‌లో గుజరాత్ కంటే ఆర్సీబీ అగ్రస్థానంలో నిలవడమే ఇందుకు కారణం.
ఇరు జట్ల ప్రయాణం ఇలా:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి నేరుగా ఫైనల్‌కు దూసుకొచ్చింది. గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1లో ఓడినప్పటికీ, లీగ్ టాపర్‌గా ఉన్నందుకు దక్కిన మరో అవకాశాన్ని జీటీ చక్కగా ఉపయోగించుకుంది. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.




