IPL 2026 : ఐపీఎల్ ఫైనల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. చెన్నై రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ, అయ్యర్ జోడీ
IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ చెలరేగి కేవలం 21 బంతుల్లోనే 50 రన్స్ పూర్తి చేసి ఐపీఎల్ ఫైనల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన టీమ్ హాఫ్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టారు.
IPL 2026
IPL 2026 : ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కేవలం కప్పు గెలవడమే కాదు.. మ్యాచ్‌లో రికార్డుల వేట సాగించింది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఓపెనర్లు క్రీజులోకి వచ్చిన నిమిషం నుంచే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కింగ్ విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ ఇద్దరూ కలిసి గుజరాత్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన టీమ్ హాఫ్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టారు. పవర్‌ప్లే ముగియక ముందే ఆర్సీబీ సృష్టించిన ఈ సరికొత్త రికార్డు వివరాలు చూద్దాం.
గుజరాత్ టైటాన్స్ విసిరిన 156 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసే క్రమంలో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ మొదటి ఓవర్ నుంచే టి20 క్రికెట్ రుచి చూపించారు. కేవలం 3.3 ఓవర్లలోనే, అంటే కేవలం 21 బంతుల్లోనే బెంగళూరు జట్టు 50 పరుగుల మార్కును దాటేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో టీమ్ 50 పరుగులు పూర్తి చేసిన పాత రికార్డులను ఆర్సీబీ చెరిపేసింది.
ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పేరిట ఉండేది. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఇదే అహ్మదాబాద్ మైదానంలో గుజరాత్ టైటాన్స్‌పైనే చెన్నై జట్టు 4 ఓవర్లలో (24 బంతుల్లో) 50 పరుగులు సాధించింది. ఇప్పుడు ఆర్సీబీ ఓపెనర్లు కేవలం 21 బంతుల్లోనే ఆ మార్కును అందుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు స్క్రాప్ లోకి వెళ్ళిపోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన గుజరాత్ మెయిన్ పేసర్ కగిసో రబాడా బౌలింగ్‌లో వెంకటేష్ అయ్యర్ ఫోర్ల వర్షం కురిపించాడు. ఆ ఓవర్లో ఏకంగా 4 బౌండరీలు బాది 18 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత ఓవర్లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌పై కోహ్లీ రెండు ఫోర్లు, అయ్యర్ ఒక ఫోర్ కొట్టి గుజరాత్ టీమ్‌ను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశారు.
ఇన్నింగ్స్ నాల్గో ఓవర్ వేయడానికి వచ్చిన రబాడాపై ఈసారి విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని చూపించాడు. వరుసగా నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. రబాడా వేసిన ఆ ఓవర్ మూడో బంతికి కోహ్లీ భారీ సిక్సర్ కొట్టగానే ఆర్సీబీ స్కోరు 50 పరుగుల మార్కును దాటి సరికొత్త చరిత్ర లిఖించింది.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టును ఆర్సీబీ బౌలర్లు తమ సొంత గడ్డపైనే ముప్పుతిప్పలు పెట్టారు. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్ లు అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి గుజరాత్ జట్టులోని ఏడుగురు టాప్ బ్యాటర్లను పడగొట్టారు. ఆల్‌రౌండర్ క్రునాల్ పాండ్యా కూడా ఒక వికెట్ తీసి చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. దీంతో గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 155 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ మిడిలార్డర్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ ఆఖర్లో ఒంటరి పోరాటం చేసి నాటౌట్‌గా 50 రన్స్ చేయకపోతే గుజరాత్ స్కోరు కనీసం వంద పరుగులు కూడా దాటేది కాదు.




