IPL 2026 Playoffs: చిన్నస్వామి నుంచి తరలిపోయిన ఐపీఎల్ ఫైనల్.. కారణం ఆ ఎమ్మెల్యేనా?
IPL 2026 Playoffs: బెంగళూరును కాదని ఫైనల్‌ను అహ్మదాబాద్ వేదికగా నిర్ణయించడంపై కకేఎస్సీఏ అసంతృప్తిగా ఉంది.
IPL 2026 Playoffs: చిన్నస్వామి నుంచి తరలిపోయిన ఐపీఎల్ ఫైనల్.. కారణం ఆ ఎమ్మెల్యేనా?
IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026కు సంబంధించిన ప్లేఆఫ్స్ వేదికలను బుధవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు ధర్మశాల, చండీగఢ్ వేదికలను మాత్రమే కేటాయించింది. మే 26న ధర్మశాలలో క్వాలిఫయర్-1, మే 27న చండీగఢ్ వేదికగా ఎలిమినేటర్, మే 29న చండీగఢ్‌లో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది. బెంగళూరును కాదని ఫైనల్‌ను అహ్మదాబాద్ వేదికగా నిర్ణయించడంపై కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) అసంతృప్తిగా ఉంది.
మాములుగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను గత సీజన్ విజేత టీమ్ హోమ్ గ్రౌండ్లో బీసీసీఐ నిర్వహిస్తుంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గత సీజన్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం ఐపీఎల్ 2026 ఫైనల్‌కు వేదిక కావాల్సింది.
అయితే బీసీసీఐ మాత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంను ఫైనల్ మ్యాచ్‌కు ఎంపిక చేసుకుంది. ప్లేఆఫ్స్‌లోని ఒక్క మ్యాచ్ కూడా చిన్నస్వామికి కేటాయించకపోవడం గమనార్హం. ప్లేఆఫ్స్ అవకాశాలు మిస్ కావడంపై కేఎస్‌సీఏ స్పందించింది. ప్లేఆఫ్స్ మ్యాచులను నిర్వహించేందుకు చిన్నస్వామి ఎప్పుడూ సిద్ధమే అని పేర్కొంది.
బీసీసీఐ నిర్ణయంపై కేఎస్‌సీఏ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే బీసీసీఐకి తెలియజేశాము. కేఎస్‌సీఏ అధ్యక్షుడు, మాజీ భారత క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ స్వయంగా బీసీసీఐతో సంప్రదింపులు జరిపారు.
బెంగళూరులో ప్లేఆఫ్స్ నిర్వహణపై ఆసక్తిని వెల్లడించారు. ప్రస్తుత సీజన్లో బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహణ పరంగా మంచి ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకుల నిర్వహణ, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ అద్భుతంగా ఉన్నాయి. భారీ మ్యాచ్‌లను సైతం ఈజీగా నిర్వహించగల సామర్థ్యం కేఎస్‌సీఏకు ఉందని నిరూపించాం. ఒక్క మ్యాచ్‌ను కూడా చిన్నస్వామికి కేటాయించకపోవడం తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది' అని కేఎస్‌సీఏ తమ ప్రకటనలో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ఈ వివాదానికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రజాప్రతినిధులకు ఉచిత టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద్ కశప్పనవర్ డిమాండ్ చేయడం వివాదానికి దారి తీసింది. ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీయడంతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో టికెట్ల కేటాయింపు అంశం, ఇతర లాజిస్టికల్ సమస్యలు కలిసి బీసీసీఐ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు సమాచారం. ఫలితంగా ఐపీఎల్ 2026 ఫైనల్‌ను అహ్మదాబాద్‌కు మార్చారు. దీంతో వరుసగా మరోసారి నరేంద్ర మోడీ స్టేడియం ఫైనల్‌కు వేదికగా నిలిచింది. గతేడాది చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట కూడా ఓ కారణం అని తెలుస్తోంది.




