IPL 2026 : ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌‎గా కోహ్లీ.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకే

IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా, రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా అవార్డులను క్లీన్ స్వీప్ చేశాడు.

CR Reddy
Published on: 1 Jun 2026 7:05 AM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi

IPL 2026 : ఐపీఎల్ 2026 ముగింపు వేడుకలు క్రికెట్ ఫ్యాన్స్‌కు మర్చిపోలేని అనుభూతిని మిగిల్చాయి. రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ అద్భుతమైన ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌‎గా నిలవగా, టోర్నమెంట్ మొత్తాన్ని శాసించిన ఒక 15 ఏళ్ల కుర్రాడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టును ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్ లు అద్భుతమైన బౌలింగ్‌తో కేవలం 155 పరుగులకే కట్టడి చేశారు. ఆ తర్వాత 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు జట్టు 5 వికెట్లు కోల్పోయి, మరో 12 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఈజీగా ఛేజ్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 75 పరుగులతో క్లాసిక్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు.

గుజరాత్‌పై ఆడిన ఈ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌కు గాను విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకోవడం ద్వారా ఐపీఎల్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక వయసులో ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో ప్లేయర్‌గా కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. కోహ్లీ ప్రస్తుతం 37 ఏళ్ల 207 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. కాగా, ఈ లిస్టులో ఆర్సీబీ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. 2009 ఐపీఎల్ ఫైనల్లో డెక్కన్ చార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయినప్పటికీ.. కుంబ్లే (38 ఏళ్ల 219 రోజులు) అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

ఐపీఎల్ ఫైనల్ హిస్టరీలో ఎక్కువ వయసున్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విజేతలు:

* అనిల్ కుంబ్లే: 38 ఏళ్ల 219 రోజులు (ఆర్సీబీ వర్సెస్ డెక్కన్ చార్జర్స్, 2009)

* విరాట్ కోహ్లీ: 37 ఏళ్ల 207 రోజులు (ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్, 2026)

* ఫాఫ్ డుప్లెసిస్: 37 ఏళ్ల 94 రోజులు (సీఎస్‌కే వర్సెస్ కేకేఆర్, 2021)

* షేన్ వాట్సన్: 36 ఏళ్ల 344 రోజులు (సీఎస్‌కే వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్, 2018)

ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి గాను మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ లేదా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ కైవసం చేసుకుని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఇతడిని కేవలం రూ.1.10 కోట్ల బేస్ ప్రైస్‌కే కొనుగోలు చేసింది. మొదటి సీజన్‌లో అతనికి కేవలం 7 మ్యాచ్‌ల్లోనే ఆడే అవకాశం వచ్చినప్పటికీ, తనేంటో నిరూపించుకున్నాడు.

ఈ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆడిన 16 మ్యాచ్‌లలో ఏకంగా 776 పరుగులు సాధించి టోర్నమెంట్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. కేవలం ఆరెంజ్ క్యాప్ మాత్రమే కాకుండా టోర్నీలో మొత్తం 5 అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ (237.3 స్ట్రైక్ రేట్), సూపర్ సిక్స్ ఆఫ్ ది సీజన్ (72 సిక్సర్లు) అవార్డులు ఉన్నాయి.

15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ బౌలర్లను వణికించిన వైభవ్ సూర్యవంశీ ఈ అవార్డుల ద్వారా భారీగా ప్రైజ్ మనీని వెనకేసుకున్నాడు. అన్ని అవార్డులు కలుపుకుని అతనికి ఏకంగా రూ.65 లక్షల నగదు బహుమతి లభించింది. దీనితో పాటు సూపర్ స్ట్రైకర్ అవార్డు కింద ఒక బ్రాండ్ న్యూ టాటా కర్వ్ కారును కూడా బహుమతిగా అందుకున్నాడు. ఈ అద్భుతమైన సీజన్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ కెరీర్‌కు ఒక సరికొత్త ఊపును ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story