IPL 2026: కోట్ల రూపాయల ధర,. అంతకుమించి అంచనాలు.. కట్ చేస్తే పేలవ ప్రదర్శలు!

IPL 2026: ఐపీఎల్ 2026లో స్టార్ ప్లేయర్లు భారీ అంచనాలను అందుకోలేక తీవ్రంగా నిరాశపర్చుతున్నారు.

Rishvik
Published on: 12 May 2026 7:31 PM IST
IPL 2026
X

IPL 2026: కోట్ల రూపాయల ధర,. అంతకుమించి అంచనాలు.. కట్ చేస్తే పేలవ ప్రదర్శలు!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 సీజన్‌లో కొందరు యువ ఆటగాళ్లు సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. సంచలన ఇన్నింగ్స్‌లతో రాత్రికి రాత్రే స్టార్స్ అవుతున్నారు. మరికొందరు స్టార్ ప్లేయర్లు మాత్రం భారీ అంచనాలను అందుకోలేక తీవ్రంగా నిరాశపర్చుతున్నారు. కోట్ల రూపాయల ధర పలికిన ఆటగాళ్లు, జట్లకు కీలకమైన స్టార్ బ్యాటర్లు ఈ సీజన్‌లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్ల పేలవ ఫామ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సూర్యకుమార్ యాదవ్:

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్‌లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కొన్ని ఇన్నింగ్స్‌ల్లో మంచి ఆరంభం ఇచ్చినా.. వాటిని పెద్ద స్కోర్లుగా మార్చుకోలేకపోయాడు. సూరీడు చేసిన 0, 12, 5, 15, 6, 16 స్కోర్లు ముంబై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ (51) మినహా.. అతడి బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు రాలేదు. మిడిల్ ఆర్డర్‌లో ముంబైకి బలమైన సూర్య.. ఈసారి అంచనాలను అందుకోలేకపోయాడు.

అక్షర్ పటేల్:

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ పరిస్థితి కూడా దాదాపు అంతే. బ్యాటింగ్‌లో తీవ్రంగా విఫలమయ్యాడు. 11, 1, 0, 2, 1, 2, 0 వంటి లో స్కోర్లు నమోదు చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో 26 రన్స్ చేసినా.. మిగతా మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఫినిషర్‌గా, ఆల్‌రౌండర్‌గా జట్టుకు కీలకమైన అక్షర్ నుంచి ఢిల్లీ అభిమానులు మరింత మెరుగైన ప్రదర్శన ఆశించారు. కానీ ఐపీఎల్ 2026లో అక్షర్ దారుణ ప్రదర్శన చేస్తున్నాడు.

జితేష్ శర్మ:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్‌కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ కూడా ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. 1, 10, 14, 10, 5, 0 స్కోర్లతో వరుసగా విఫలమయ్యాడు. ఒక మ్యాచ్‌లో 23 పరుగులతో మెరుపులు మెరిపించినా.. నిలకడ లేకపోవడం అతడిపై విమర్శలకు దారితీసింది. కీలక సమయాల్లో ఫినిషింగ్ బాధ్యతలు నిర్వర్తించాల్సిన జితేష్ నుంచి ఆర్సీబీ అభిమానులు ఇంకా పెద్ద ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

నికోలస్ పూరన్:

లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ కూడా ఈసారి నిరాశపరిచాడు. ఒక మ్యాచ్‌లో కేవలం 11 బంతుల్లో 63 పరుగులు చేసి సంచలనం సృష్టించినా.. మిగతా మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాడు. 1, 9, 22, 1, 19, 21, 8 స్కోర్లు అతడిపై విమర్శలకు కారణమయ్యాయి. భారీ షాట్లతో మ్యాచ్‌లను మార్చగల సామర్థ్యం ఉన్న పూరన్.. ఈసారి నిలకడ కోల్పోయాడు. ఇప్పటికే లక్నో రేసు నుంచి తప్పుకోగా.. వచ్చే ఏడాది అతడు ఏ జట్టులో ఉంటాడో చూడాలి.

రిషభ్ పంత్:

లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడు. కొన్ని మ్యాచ్‌ల్లో 42, 43, 68 వంటి ఇన్నింగ్స్‌లు ఆడినా.. వరుసగా తక్కువ స్కోర్లతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 0, 1, 7, 10 వంటి స్కోర్లు అతడి ఫామ్‌పై ప్రశ్నలు లేవనెత్తాయి. కెప్టెన్‌గా, ప్రధాన బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించాల్సిన పంత్.. కీలక మ్యాచ్‌ల్లో విఫలమవడం లక్నో ప్లేఆఫ్స్ అవకాశాలపై ప్రభావం చూపింది. ఐపీఎల్ వంటి పెద్ద టోర్నీలో ఫామ్, నిలకడ చాలా కీలకం. ఈ స్టార్ ప్లేయర్లకు భారీగా ధర పలికినా.. అందుకు న్యాయం చేయలేకపోయారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story