IPL 2026 : గుజరాత్ టైటాన్స్‌ను ఊచకోత కోసిన కోల్‌కతా.. ప్లేఆఫ్స్ రేసులో నైట్ రైడర్స్

IPL 2026 : ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ విధ్వంసం సృష్టించింది. గుజరాత్ టైటాన్స్‌పై 247 పరుగులు చేసి, 29 పరుగులతో విజయం సాధించింది.

CR Reddy
Published on: 17 May 2026 6:47 AM IST
IPL 2026
X

IPL 2026

IPL 2026 : ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేసింది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 29 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో కోల్‌కతా ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కేకేఆర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో స్టేడియం ఫోర్లు, సిక్సర్ల వర్షంతో తడిసిపోయింది. గుజరాత్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది.

కోల్‌కతా ఓపెనర్ ఫిన్ అలెన్ ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే 93 పరుగులు చేసి సెంచరీకి చేరువయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఏకంగా 10 సిక్సర్లు ఉండటం విశేషం. మరోవైపు యువ సంచలనం అంగ్ క్రిష్ రఘువంశీ (44 బంతుల్లో 82 నాటౌట్) గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివర్లో కామెరాన్ గ్రీన్ (28 బంతుల్లో 52 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కోర్లను నమోదు చేసింది.

248 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 85) ఒంటరి పోరాటం చేశాడు. జోస్ బట్లర్ (57) నుంచి అతనికి మంచి సహకారం అందింది. చివర్లో సాయి సుదర్శన్ మళ్ళీ క్రీజులోకి వచ్చి హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు మాత్రమే చేయగలిగింది.

బ్యాటర్ల రాజ్యమైన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ స్పిన్ మాంత్రికుడు సునీల్ నరైన్ అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అందరూ భారీగా పరుగులు ఇస్తున్న వేళ, నరైన్ తన 4 ఓవర్లలో కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ప్రమాదకరంగా మారుతున్న శుభ్‌మన్ గిల్‌ను అవుట్ చేయడంతో గుజరాత్ ఓటమి ఖాయమైంది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సమష్టిగా రాణించిన కేకేఆర్.. ప్లేఆఫ్స్ రేసులో తమ ఉనికిని చాటుకుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story