IPL 2026 : ఏబీ డివిలియర్స్ రికార్డ్ బద్దలు కొట్టిన రాహుల్.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానం మనోడిదే
IPL 2026 : కేఎల్ రాహుల్ రాజస్థాన్ రాయల్స్‌పై 9వ సారి హాఫ్ సెంచరీ బాది ఏబీ డివిలియర్స్ రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే 8వ సారి 500 రన్స్ సీజన్ పూర్తి చేసి కోహ్లీకి చేరువయ్యాడు.
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తన బ్యాట్‌తో విన్యాసాలు చేస్తున్నాడు. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాహుల్ అద్భుత హాఫ్ సెంచరీతో మెరిశాడు. గత మూడు మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులకే అవుట్ అయి విమర్శలు ఎదుర్కొన్న రాహుల్, రాజస్థాన్‌పై తనదైన శైలిలో విరుచుకుపడి విమర్శకుల నోళ్లు మూయించాడు. కేవలం 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన రాహుల్, ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
కేఎల్ రాహుల్‌కు రాజస్థాన్ రాయల్స్ జట్టు అంటే భలే ఇష్టం. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్‌పై అత్యధిక సార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 19 ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ ఏకంగా 9 సార్లు రాజస్థాన్‌పై హాఫ్ సెంచరీలు బాదాడు. ఈ క్రమంలో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (8 సార్లు) రికార్డును రాహుల్ అధిగమించాడు. రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించడంలో రాహుల్ ఇప్పుడు నంబర్ 1 పొజిషన్‌కు చేరుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 56 పరుగులు చేసిన రాహుల్, ఐపీఎల్ 2026 సీజన్‌లో 500 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఈ సీజన్‌లో 500 రన్స్ మార్క్‌ను దాటిన ఐదో బ్యాటర్‌గా అతను నిలిచాడు. ఇక్కడే మరో అద్భుతమైన విషయం ఉంది.. రాహుల్ ఒక ఐపీఎల్ సీజన్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది ఎనిమిదోసారి (8వ సారి). ఇప్పటివరకు విరాట్ కోహ్లీ మాత్రమే 9 సార్లు ఈ ఫీట్ సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు కోహ్లీ తర్వాతి స్థానంలో రాహుల్ నిలిచి, తన నిలకడైన ఆటతీరును మరోసారి నిరూపించుకున్నాడు.
రాహుల్ (56), అభిషేక్ పోరెల్‌తో కలిసి మొదటి వికెట్‌కు 105 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరి పుణ్యమా అని ఢిల్లీ క్యాపిటల్స్ 193 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. చివర్లో కెప్టెన్ అక్షర్ పటేల్ (34 నాటౌట్), అశుతోష్ శర్మ (18 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశలను చివరి మ్యాచ్ వరకు సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ తన స్థానాన్ని మెరుగుపరుచుకుని మిగతా జట్లకు గట్టి పోటీ ఇస్తోంది.




