IPL 2026 : లక్నో విధ్వంసం.. చెన్నై బౌలర్లను ఉతికారేసిన మిచెల్ మార్ష్.. ప్లేఆఫ్స్ నుంచి సీఎస్‌కే అవుట్ ?
IPL 2026 : ఐపీఎల్ 2026లో చెన్నైపై లక్నో ఘనవిజయం సాధించింది. మిచెల్ మార్ష్ 90 పరుగుల వీరవిహారంతో 7 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. సీఎస్‌కే ప్లేఆఫ్ ఆశలు ఇప్పుడు సంక్లిష్టంగా మారాయి.
LSG vs CSK
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ క్రమంలో లక్నోలోని ఇటానా స్టేడియం వేదికగా జరిగిన 59వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అద్భుత ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో చెన్నై ప్లేఆఫ్స్ ఆశలు గందరగోళంలో పడ్డాయి. లక్నో బ్యాటర్ల విధ్వంసక ఇన్నింగ్స్ ముందు చెన్నై బౌలర్లు చేతులెత్తేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. సీజన్‌లో నాలుగో విజయాన్ని అందుకున్న లక్నో తన సత్తా చాటగా, కీలక సమయంలో చెన్నై తడబడటం అభిమానులను నిరాశకు గురిచేసింది.
టాస్ గెలిచిన రిషబ్ పంత్ సేన మొదట బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చెన్నై ఇన్నింగ్స్ మొదట్లోనే తడబడింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (13) త్వరగానే వెనుదిరగగా, సంజూ శామ్సన్ (20) కూడా నిరాశపరిచాడు. అయితే కార్తీక్ శర్మ (71) అద్భుత పోరాటంతో జట్టును ఆదుకున్నాడు. చివర్లో శివమ్ దూబే 16 బంతుల్లో 32 పరుగులతో మెరుపులు మెరిపించగా, డెవాల్డ్ బ్రెవిస్ 25 పరుగులు చేసి స్కోరును గౌరవప్రదంగా మార్చారు. లక్నో బౌలర్లలో ఆకాష్ సింగ్ 3 వికెట్లతో చెన్నై నడ్డి విరిచాడు.
188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 135 పరుగులు జోడించి మ్యాచ్‌ను పూర్తిగా లక్నో వైపు తిప్పేశారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ 38 బంతుల్లోనే 90 పరుగులు చేసి చెన్నై బౌలర్లను ఆటాడుకున్నాడు. అతని స్ట్రైక్ రేట్ 236 కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఇంగ్లిస్ 36 పరుగులతో తన వంతు సహకారం అందించాడు. చివర్లో నికోలస్ పూరన్ (32 నాటౌట్) లాంఛనంగా టార్గెట్ ఛేజ్ చేయడంతో లక్నో కేవలం 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ ఓటమి చెన్నై సూపర్ కింగ్స్ అవకాశాలను బాగా దెబ్బతీసింది. ప్రస్తుతం 12 మ్యాచ్‌లు ఆడిన చెన్నై ఖాతాలో 12 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. నెట్ రన్ రేట్ కూడా 0.027కు పడిపోయింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో చెన్నై గెలవడం ఇప్పుడు అనివార్యంగా మారింది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలమవడంపై మేనేజ్మెంట్ తల పట్టుకుంటోంది. మరి రాబోయే డూ ఆర్ డై మ్యాచ్‌లలో ధోనీ సేన ఎలా పుంజుకుంటుందో చూడాలి.




