IPL Playoffs: ఐపీఎల్ చరిత్రలో మాజీ టీమ్ చెత్త రికార్డు.. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ వంతు!

LSG Hold Worst Record in IPL 2026. ఐపీఎల్ 2026లో అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ఎల్‌ఎస్‌జీ నిలిచింది.

Rishvik
Published on: 11 May 2026 5:22 PM IST
IPL Playoffs
X

IPL Playoffs

IPL Playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా మారింది. ప్లేఆఫ్స్ రేసులో అధికారికంగా 8 టీమ్స్ ఉన్నా.. సమీకరణాల ప్రకారం 6 జట్ల మధ్యనే పోటీ ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ) టీమ్స్ ఇప్పటికే ఇంటిదారి పట్టాయి. ఐపీఎల్ 2026లో అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ఎల్‌ఎస్‌జీ నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి తర్వాత లక్నో ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా ముగిశాయి. ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రెండో జట్టుగా ఎంఐ పేరు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రతి ఐపీఎల్ సీజన్‌లో తొలి ఎలిమినేట్ జట్టుగా ఏ ప్రాంచైజీ ఉందో ఓసారి తెలుసుకుందాం.

ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ప్రతి సీజన్‌లో ఒక జట్టు తొలిగా ప్లేఆఫ్స్ ఛాన్సెస్ కోల్పోతూ వస్తోంది. తొలి సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ (డీసీ) ఈ చెత్త రికార్డును నమోదు చేసింది. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి పెద్ద జట్లు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు మొదటిసారి ఎలిమినేట్ అయిన జట్టుగా నిలిచింది మాత్రం మాజీ ప్రాంచైజీ డెక్కన్ ఛార్జర్స్. 2008, 2011, 2012 సీజన్‌లలో డీసీ ముందుగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

డెక్కన్ ఛార్జర్స్ తర్వాత ఈ జాబితాలో రెండేసి సార్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నాయి. 2020లో సీఎస్‌కే తొలిసారి ప్లేఆఫ్స్‌కు చేరకుండా అందరికీ షాకిచ్చింది. 2022, 2024లో ముంబై ఇండియన్స్ ముందుగానే ఇంటిబాట పట్టగా.. 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఎలిమినేట్ జట్టుగా నిలిచింది. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ ముందుగానే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడం అభిమానులకు పెద్ద నిరాశగా మారింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఎల్‌ఎస్‌జీ.. కీలక మ్యాచ్‌ల్లో విఫలమై చివరకు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ప్రతి ఐపీఎల్ సీజన్‌లో తొలి ఎలిమినేట్ జట్లు:

2008 – డెక్కన్ ఛార్జర్స్

2009 – కోల్‌కతా నైట్ రైడర్స్

2010 – పంజాబ్ కింగ్స్

2011 – డెక్కన్ ఛార్జర్స్

2012 – డెక్కన్ ఛార్జర్స్

2013 – పుణే వారియర్స్ ఇండియా

2014 – ఢిల్లీ క్యాపిటల్స్

2015 – పంజాబ్ కింగ్స్

2016 – రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్

2017 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

2018 – ఢిల్లీ క్యాపిటల్స్

2019 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

2020 – చెన్నై సూపర్ కింగ్స్

2021 – సన్‌రైజర్స్ హైదరాబాద్

2022 – ముంబై ఇండియన్స్

2023 – ఢిల్లీ క్యాపిటల్స్

2024 – ముంబై ఇండియన్స్

2025 – చెన్నై సూపర్ కింగ్స్

2026 – లక్నో సూపర్ జెయింట్స్

అత్యధిక సార్లు తొలి ఎలిమినేట్ జట్లుగా నిలిచిన టీమ్స్:

3 సార్లు – డెక్కన్ ఛార్జర్స్ (2008, 2011, 2012)

2 సార్లు – ఆర్సీబీ (2017, 2019)

2 సార్లు – ముంబై ఇండియన్స్ (2022, 2024)

2 సార్లు – చెన్నై సూపర్ కింగ్స్ (2020, 2025)

2 సార్లు – పంజాబ్ కింగ్స్ (2010, 2015)

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story