IPL 2026: ఎక్కువగా మాట్లాడుకున్న ప్లేయర్స్ వీరే.. లిస్టులో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ప్లేయర్, వైభవ్ పేరే లేదు!

IPL 2026: యువ ఆటగాళ్లు సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నా.. అభిమానుల మధ్య ఎక్కువగా చర్చకు వచ్చిన ప్లేయర్ల జాబితా మాత్రం ఆసక్తికరంగా ఉంది.

Rishvik
Published on: 12 May 2026 8:04 PM IST
IPL 2026
X

IPL 2026: ఎక్కువగా మాట్లాడుకున్న ప్లేయర్స్ వీరే.. లిస్టులో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ప్లేయర్, వైభవ్ పేరే లేదు!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండగా.. ప్లేఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు 11 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో టాప్-3లో కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో యువ ఆటగాళ్లు సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నా.. అభిమానుల మధ్య ఎక్కువగా చర్చకు వచ్చిన ప్లేయర్ల జాబితా మాత్రం ఆసక్తికరంగా ఉంది.

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులోనే అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ బ్యాటర్ రెండు సార్లు 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అంతేకాదు 36 బంతుల్లో సెంచరీ బాది.. ఐపీఎల్ చరిత్రలో 40 బంతుల లోపు రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయినప్పటికీ అతడు ఐపీఎల్ 2026లో భారతదేశంలో ఎక్కువగా చర్చకు వచ్చిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాడు.

ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మార్చి 28 నుంచి మే 12 వరకు భారతదేశంలో అత్యధికంగా చర్చకు వచ్చిన ఆటగాళ్ల జాబితాలో కింగ్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తం చర్చల్లో 44 శాతం కోహ్లీ గురించే ఉండటం విశేషం. రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 21 శాతంతో నిలిచాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ధోనీ ఇప్పటివరకు ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాల్ఫ్ ఇంజరీ కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమైనప్పటికీ.. అతడి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

మూడో స్థానంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 18 శాతంతో నిలిచాడు. నాలుగో స్థానంలో స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ 10 శాతం, ఐదో స్థానంలో ఢిల్లీ ఆటగాడు లోకేష్ రాహుల్ 8 శాతంతో ఉన్నారు. ఈ జాబితా చూస్తే యువ ఆటగాళ్లు సంచలన ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ.. భారత క్రికెట్‌లో స్టార్ సీనియర్ ప్లేయర్ల క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. ఏదేమైనా అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ఇప్పటికీ చెన్నై జట్టుతో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో గాయం కారణంగా మైదానంలోకి దిగకపోయినా.. అభిమానుల హృదయాల్లో మాత్రం అతడే టాప్ స్టార్‌గా కొనసాగుతున్నాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story