MS Dhoni : సీఎస్‌కేతో ధోనీ 18 ఏళ్ల బంధం ముగిసిందా? వచ్చే సీజన్‌లో కొత్త ఐపీఎల్ టీమ్‌లోకి తలా

MS Dhoni : ఐపీఎల్ 2026 తర్వాత ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌తో మనస్పర్థల కారణంగా ఆయన కొత్త ఫ్రాంచైజీకి ఆడే అవకాశం ఉంది.

CR Reddy
Published on: 21 May 2026 6:33 AM IST
MS Dhoni
X

MS Dhoni

MS Dhoni : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన, అభిమానులు ప్రాణంగా ప్రేమించే క్రేజీ కాంబినేషన్ ఏదైనా ఉందీ అంటే అది మహేంద్ర సింగ్ ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బంధం మాత్రమే. అయితే, ఇప్పుడు క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడేలా ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి శాశ్వతంగా గుడ్ బై చెప్పబోతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సీజన్‌లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా, చెన్నై హోమ్ గ్రౌండ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో కనిపించి సందడి చేశారు. కానీ, అంతరార్థంలో సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కు, ధోనీకి మధ్య బంధం చెడిందనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది.

నిజంగానే ధోనీ కొత్త టీమ్‌లోకి వెళ్తున్నారా?

ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్‌బ్లాగర్ నివేదిక ప్రకారం.. రాబోయే ఐపీఎల్ సీజన్లలో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో కనిపించడం దాదాపు అసాధ్యమని తెలుస్తోంది. అయితే ధోనీ క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటిస్తారా? లేక వేరే జట్టుకు ఆడతారా? అనేదానిపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. కానీ ఒకవేళ ఆయన వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకుంటే మాత్రం.. చెన్నై కాకుండా వేరే ఏదైనా సరికొత్త ఫ్రాంచైజీ తరఫున మైదానంలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆ రిపోర్ట్ సంచలన క్లెయిమ్ చేసింది. ఒకవేళ ఇదే నిజమైతే ధోనీని వేరే జెర్సీలో చూడటం క్రికెట్ ఫ్యాన్స్‌కు అస్సలు జీర్ణించుకోలేని విషయమే.

అసలు కారణం ఇదేనా?

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో ధోనీకి పిక్క కండరాల గాయం అయిన మాట నిజమే అయినప్పటికీ.. ఆయన జట్టుకు దూరం కావడానికి కేవలం ఫిట్‌నెస్ మాత్రమే కారణం కాదని సమాచారం. భవిష్యత్తు వ్యూహాల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ఇకపై యువ ఆటగాళ్లతో కొత్త టీమ్‌ను నిర్మించాలని గట్టిగా ఫిక్స్ అయిందట. గత రెండేళ్లుగా ఆటగాళ్ల బదిలీలు, జట్టు ఎంపికకు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాల్లో ధోనీ ప్రమేయం లేకుండానే మేనేజ్‌మెంట్ స్వయంగా నిర్ణయాలు తీసుకుందని, దీనివల్ల ధోనీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని తెలుస్తోంది. ఈ వ్యవహారంతో ఇరుపక్షాల మధ్య దూరం బాగా పెరిగిందని అంతర్గత వర్గాల టాక్.

చెన్నైని 5 సార్లు ఛాంపియన్‌గా నిలిపిన ఘనుడు

మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ ప్రారంభమైన 2008 సంవత్సరం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోనే ప్రయాణం చేస్తున్నారు. కేవలం రెండు సీజన్లు మాత్రమే (సీఎస్‌కే బ్యాన్ అయినప్పుడు) ఆయన పూణే జట్టుకు ఆడారు. ధోనీ తన అద్భుతమైన కెప్టెన్సీతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఏకంగా 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీలను అందించారు. అంతేకాకుండా, రెండుసార్లు ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లను కూడా గెలిపించారు. చెన్నై జట్టును ఒక బ్రాండ్‌లా మార్చిన ధోనీ.. భవిష్యత్తులో గనుక వేరే ఐపీఎల్ టీమ్ మెంటార్‌గానో లేదా ప్లేయర్‌గానో కనిపిస్తే మాత్రం క్రికెట్ చరిత్రలోనే అది ఒక అత్యంత భావోద్వేగమైన క్షణంగా మిగిలిపోతుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story