IPL 2026-BCCI: ఐపీఎల్ 2026 ఆరంభం ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. నిరాశలో ఫాన్స్!
IPL 2026-BCCI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
IPL 2026-BCCI: ఐపీఎల్ 2026 ఆరంభం ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. నిరాశలో ఫాన్స్!
IPL 2026-BCCI:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించకూడదని నిర్ణయించింది. గత ఏడాది బెంగళూరులో జరిగిన విషాద ఘటనలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. మృతుల పట్ల గౌరవ సూచకంగా ఎలాంటి వేడుకలు లేకుండానే టోర్నీ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్ 2026 మార్చి 28న ఆరంభం కానుంది. రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ విషయం తెలిసిన ఫాన్స్ నిరాశకు గురవుతున్నారు.
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో తలపడనున్నాయి. సాధారణంగా ప్రతి సీజన్ ప్రారంభంలో జరిగే సంగీత, నృత్య కార్యక్రమాలు ఈసారి ఉండవు. అయితే టోర్నీ ముగింపు సందర్భంగా మాత్రం భారీ స్థాయిలో వేడుకలను నిర్వహించాలని బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్లాన్ చేస్తున్నాయి. మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్ రోజున గ్రాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. గత సీజన్‌లా బాలీవుడ్ స్టార్స్, ప్రముఖ గాయకులతో భారీ షో ఉండే అవకాశముంది.
2025 ఐపీఎల్ ప్రారంభ వేడుక కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్, సింగర్ కరణ్ ఔజ్లా, హీరోయిన్ దిశా పటాని వంటి ప్రముఖులు పాల్గొని ప్రేక్షకులను అలరించారు. కానీ ఈసారి మాత్రం ఆ హంగామా ఉండదు. బెంగళూరు విషాదానికి గౌరవంగా ఓపెనింగ్ సెర్మనీని రద్దు చేయడం ఒక వైపు భావోద్వేగ నిర్ణయం కాగా.. మరోవైపు ఫైనల్ రోజు గ్రాండ్ ముగింపు వేడుకలతో అభిమానులకు ప్రత్యేక అనుభూతిని ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్ 2026 కోసం క్రికెట్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆర్‌సీబీ ఫ్రాంచైజీ యాజమాన్యంలో ఇటీవల భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం రూ.16,660 కోట్లకు ఆర్‌సీబీని కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విలువైన ఫ్రాంచైజీగా ఆర్‌సీబీ నిలిచింది. ఈ కన్సార్టియంలో బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. కొత్త యాజమాన్య నిర్మాణంలో ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ ఆర్యమన్ విక్రమ్ బిర్లా ఆర్‌సీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. టైమ్స్ ఇంటర్నెట్‌కు చెందిన సత్యన్ గజ్వాని వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మార్పులతో ఆర్‌సీబీ భవిష్యత్తులో మరింత బలంగా మారుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.




