IPL 2026: ఉత్కంఠ రేపుతున్న ప్లేఆఫ్స్ రేసు.. ఏ జట్టుకు అవకాశాలు ఉన్నాయంటే?
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశలో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి.
IPL 2026: ఉత్కంఠ రేపుతున్న ప్లేఆఫ్స్ రేసు.. ఏ జట్టుకు అవకాశాలు ఉన్నాయంటే?
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశలో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తి అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇక నుంచి ప్రతి మ్యాచ్ అన్ని జట్లకు కీలకంగా మారనుంది. సగం మ్యాచ్‌లు పూర్తి కావడంతో.. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచి నాకౌట్ దశకు చేరుకోవడానికి జట్ల మధ్య పోటీ తీవ్రమైంది. ఏ జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉంటుందో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే. కానీ ప్రస్తుత ప్రదర్శనను బట్టి ఏ టీమ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయో ఒక అంచనాకు రావచ్చు.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ (13 పాయింట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (10 పాయింట్లు), రాజస్థాన్ రాయల్స్ (10 పాయింట్లు) పట్టికలో టాప్-4 స్థానాల్లో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు, గత సీజన్ ఫైనలిస్ట్ పంజాబ్ తమ జోరును కొనసాగిస్తున్నాయి.
పంజాబ్ కింగ్స్ మరో మూడు విజయాలను సాధిస్తే అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అవడమే కాకుండా.. అగ్రస్థానంలో ఉండనుంది. మిగిలిన 7 మ్యాచ్‌లలో బెంగళూరుకు కూడా మూడు విజయాలు అవసరం. రన్ రేట్ కూడా ఈ జట్లకు కలిసిరానుంది. ఇప్పటికే 8 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్, రాజస్థాన్ జట్లకు మూడు విజయాలు తప్పనిసరి.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. రెండే విజయాలు అందుకున్న ముంబై.. టాప్ 4లో ఉండాలంటే అద్భుతమే జరగాలి. ఇక లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ జట్లు ఇకపై ఓడితే.. నాకౌట్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయినట్లే. అట్టడుగున ఉన్న కోల్‌కతా వరుసగా ఏడు మ్యాచులు గెలిచినా ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంపై సందిగ్ధత నెలకొంది. కోల్‌కతా రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్లే.
ఆరంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ (6 పాయింట్లు) ఇప్పుడిప్పుడే విజయాలతో రేసులోకి వస్తోంది. అయితే, ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే మిగిలిన ఏడు మ్యాచ్‌లలో కనీసం ఐదు లేదా ఆరు విజయాలు సాధించడం తప్పనిసరి. మరోవైపు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నిలకడలేమితో సతమతమవుతున్నాయి. మూడేసి విజయాలు అందుకున్న ఈ రెండు జట్లు ఏడు మ్యాచులలో కనీసం ఐదు గెలవాల్సి ఉంటుంది.
సాధారణంగా టాప్-4లో నిలవాలంటే కనీసం 9 విజయాలు అవసరం. 8 విజయాలు సాధించినా.. బెర్త్ దక్కుతుంది. అపుడు నెట్ రన్‌రేట్ కీలకంగా మారుతుంది. అంతకంటే తక్కువ విజయాలు సాధిస్తే.. ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయినట్లే. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్లు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాయి. కింద ఉన్న జట్లు ఇక ప్రతి మ్యాచ్‌ను ఫైనల్‌గా భావించి ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. చూడాలి మరి టాప్ 4లో ఏ జట్లు ఉంటాయో.




