IPL 2026: టాప్-2 కోసం ఆర్సీబీ, జీటీ పోటీ.. ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ ఓటమి ఎదురైతే?

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు చివరి దశకు వచ్చేసింది.

Rishvik
Published on: 16 May 2026 7:02 PM IST
IPL 2026
X

IPL 2026: టాప్-2 కోసం ఆర్సీబీ, జీటీ పోటీ.. ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ ఓటమి ఎదురైతే?

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు చివరి దశకు వచ్చేసింది. ఇప్పటివరకు అధికారికంగా ఒక బెర్త్ కూడా ఖాయం కాలేదు. కొన్ని జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకోగా.. మరికొన్ని టీమ్స్ టాప్-4 కోసం పోరాడుతున్నాయి. ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాల కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య ఆసక్తికర పోటీ కొనసాగుతోంది.

16 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ప్లస్ 1.103 నెట్ రన్‌రేట్ ఆ జట్టుకు భారీ అడ్వాంటేజ్‌గా మారింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచినా.. టాప్-2లో నిలిచే అవకాశాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్, బౌలింగ్ యూనిట్ స్థిరమైన ప్రదర్శన ఆర్సీబీకి బలంగా మారాయి. గుజరాత్ కూడా 16 పాయింట్లతో దాదాపుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కేకేఆర్ లేదా సీఎస్‌కేపై మిగిలిన మ్యాచ్‌ల్లో ఒకటి గెలిస్తే.. టాప్-2 స్థానం ఖాయం కానుంది. ఈ రెండు టీమ్స్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తే.. టాప్-2 ఫిక్స్ అవుతాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇటీవల ఓటమి ఎదురైనా.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖాయం అవుతుంది. రెండు గెలిస్తే టాప్-2 కూడా దక్కే అవకాశాలు లేకపోలేదు. అయితే ఒకదాంట్లో గెలిచినా.. ఇంకో మ్యాచులో భారీ ఓటమి నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే నెట్ రన్‌రేట్ తగ్గుతుంది. పంజాబ్ కింగ్స్ పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 13 పాయింట్లతో ఉన్న శ్రేయస్ సేన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే 17 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒక భారీ విజయం, ఇతర జట్ల ఫలితాలు అనుకూలిస్తే కూడా అవకాశం ఉండొచ్చు.

రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో బలమైన స్థితిలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ దాదాపుగా ఖాయం చేసుకునే అవకాశం ఉంది. ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఇప్పుడు డూ ఆర్ డై పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆరో స్థానానికి పడిపోయిన సీఎస్‌కే.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌పై తప్పక గెలవాలి. అంతేకాదు భారీ విజయాలతో నెట్ రన్‌రేట్ మెరుగుపరుచుకోవాల్సి ఉంది. అదే సమయంలో రాజస్థాన్, పంజాబ్ జట్లు పాయింట్లు ఓడిపోవాల్సి ఉంటుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ప్రస్తుతం 9 పాయింట్లతో ఉన్న కేకేఆర్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి 15 పాయింట్లకు చేరినా.. భారీ నెట్ రన్‌రేట్ మెరుగుదలతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా అనుకూలించాలి. ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా దాదాపుగా అంతే. 10 పాయింట్లతో ఉన్న ఢిల్లీకి ప్లేఆఫ్స్ చేరాలంటే వరుస విజయాలతో పాటు అద్భుత నెట్ రన్‌రేట్, ఇతర జట్ల వరుస పరాజయాలు అవసరం. ఇక ఇప్పటికే ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నాయి. దీంతో మిగిలిన బెర్త్‌ల కోసం ఇప్పుడు సీఎస్‌కే, పంజాబ్, రాజస్థాన్, సన్‌రైజర్స్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు చివరి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగేలా కనిపిస్తోంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story