IPL 2026 Playoffs: ప్లేఆఫ్స్ చేరే జట్లు ఇవే, ఆ టీమ్ వస్తే మాత్రం ఆపడం కష్టమే.. ఆర్ అశ్విన్ జోస్యం!

R Ashwin Predicts IPL 2026 Playoffs Top 4 Teams. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండగా ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది.

Rishvik
Published on: 9 May 2026 6:54 PM IST
IPL 2026 Playoffs Ravichandran Ashwin Predicts Top 4 Teams, Warns About CSK And KKR
X

IPL 2026 Playoffs Ravichandran Ashwin Predicts Top 4 Teams, Warns About CSK And KKR

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండగా ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోయినా.. కొన్ని జట్లు మాత్రం బలమైన స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు చెరో 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచాయి. ఈ ఐదు టీమ్స్ మధ్య ఇప్పుడు రసవత్తర పోరు కొనసాగుతోంది.

ఇక చెన్నై సూపర్ కింగ్స్ 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ 9 పాయింట్లతో ఏడవ స్థానంలోనిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో 8 పాయింట్స్ ఉండగా.. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చెరో 6 పాయింట్లతో చిట్టచివరి స్థానాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నట్టేనని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. మిగిలిన రెండు స్థానాల కోసం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని పేర్కొన్నాడు.

‘ఎస్‌ఆర్‌హెచ్, ఆర్‌సీబీలకు ప్లేఆఫ్స్‌ బెర్త్ దాదాపు కన్ఫర్మ్. జీటీ, ఆర్ఆర్, పీబీకేఎస్ జట్లలో రెండే ప్లేఆఫ్స్ బెర్త్‌లు దక్కించుకుంటాయి’ అని ఆర్ అశ్విన్ చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలపై కూడా అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సీఎస్‌కే తప్పనిసరిగా మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలవాల్సిందేనని స్పష్టం చేశాడు. ‘చెన్నై ఇక అదృష్టంపై ఆధారపడలేదు. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే 16 పాయింట్లు వస్తాయి. అయినా కూడా రాజస్థాన్ రాయల్స్ తమ నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓడిపోవాలి. పంజాబ్ కింగ్స్ కూడా పాయింట్లు కోల్పోవాలి. అంతేకాదు సీఎస్‌కే నెట్ రన్‌రేట్ కూడా బలంగా ఉండాలి’ అని వివరించాడు.

నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషిస్తుందని మాజీ స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్‌పై జరిగే రెండు మ్యాచ్‌లు సీఎస్‌కే భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పాడు. ‘ఎల్ఎస్‌జీపై చెన్నై రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. కేవలం ప్లేఆఫ్స్‌కే కాదు, 2010 తరహాలో టైటిల్ దాకా వెళ్లే అవకాశం ఉంది. ఇక నుంచి ప్రతి మ్యాచ్ బ్లాక్‌బస్టర్‌లా ఉంటుంది’ అని అశ్విన్ పేర్కొన్నాడు. కేఆర్‌ ప్లేఆఫ్స్‌కు చేరకపోవచ్చని, ఒకవేళ చేరితే ప్రమాదకరంగా మారుతుందని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్స్ రేసు రోజు రోజుకీ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పు కూడా జట్ల భవితవ్యాన్ని మార్చే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రతి మ్యాచ్‌కు ప్రాధాన్యం పెరిగిపోయింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story