IPL 2026 : ఆర్సీబీ, గుజరాత్‌లపై బీసీసీఐ కాసుల వర్షం.. 5 అవార్డులందుకున్న వైభవ్
IPL 2026 : ఐపీఎల్ 2026లో గెలిచిన ఆర్సీబీకి ప్రైజ్ మనీగా రూ.20 కోట్లు, రన్నరప్ గుజరాత్‌కు రూ.12.50 కోట్లు దక్కాయి. రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఏకంగా 5 అవార్డులను గెలుచుకున్నాడు.
IPL 2026
IPL 2026 : ఐపీఎల్ 2026 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆటగాళ్లు, జట్లపై కాసుల వర్షం కురిపించింది. ఈ సీజన్ ప్రైజ్ మనీ కోసం బీసీసీఐ ఏకంగా రూ.46 కోట్ల భారీ పూల్‌ను కేటాయించింది. గెలిచిన జట్లతో పాటు, వ్యక్తిగత ప్రదర్శనలతో అదరగొట్టిన ప్లేయర్లకు భారీగా నజరానాలు దక్కాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అవార్డుల వేటలో సరికొత్త రికార్డు సృష్టించాడు.
రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి కప్పు కొట్టి తమ టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకుంది. 17 ఏళ్ల పాటు ఒక్క ట్రోఫీ కూడా లేక ఏడిపించిన ఆర్సీబీ, ఇప్పుడు వరుసగా రెండేళ్లలో రెండు ఐపీఎల్ ట్రోఫీలు గెలవడం అభిమానులకు ఒక కల నిజమైనట్లు అనిపిస్తోంది. ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన మూడో కెప్టెన్‌గా రజత్ పాటిదార్ నిలిచాడు. ఇంతకుముందు ఈ అరుదైన ఫీట్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని (2010, 2011), ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (2019, 2020) మాత్రమే సాధించారు.
బీసీసీఐ ప్రకటించిన రూ.46 కోట్ల ప్రైజ్ మనీ పూల్‌లో సింహభాగం విజేతగా నిలిచిన ఆర్సీబీ ఖాతాలోకి చేరింది. టైటిల్ గెలిచిన బెంగళూరు జట్టుకు ఏకంగా రూ.20 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు రూ.12.50 కోట్లను సొంతం చేసుకుంది. ఇక ప్లేఆఫ్స్ చేరి మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ (RR)కు రూ.7 కోట్లు దక్కగా, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయి నాల్గో స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు రూ.6.50 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.
ఐపీఎల్ 2026 ఫైనల్ ప్రెజెంటేషన్ సెర్మనీలో రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు. లీగ్ నుంచి తన జట్టు ఎలిమినేట్ అయినప్పటికీ, తన అద్భుతమైన ప్రదర్శనతో ఈ కుర్రాడు ఏకంగా 5 అవార్డులను కొల్లగొట్టి ప్రైజ్ మనీ వేదికను షేక్ చేశాడు. టోర్నీలోనే అత్యుత్తమ ఆటగాడిగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ (మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ - రూ.15 లక్షలు) అవార్డు గెలుచుకున్నాడు. దీనితో పాటు సీజన్‌లో అత్యధిక పరుగులు చేసినందుకు ఆరెంజ్ క్యాప్ (రూ.10 లక్షలు), ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ (రూ.20 లక్షలు), సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ (రూ.10 లక్షలతో పాటు ఒక బ్రాండ్ న్యూ టాటా కర్వ్ కారు), టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టినందుకు మరో రూ.10 లక్షల నగదు బహుమతిని వైభవ్ అందుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. దీనికి గాను అతనికి రూ.10 లక్షల ప్రైజ్ మనీ లభించింది. అదే జట్టుకు చెందిన స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ టోర్నీలో అత్యధిక డాట్ బాల్స్ వేసినందుకు గ్రీన్ డాట్ బాల్స్ అవార్డుతో పాటు రూ.10 లక్షల బహుమతిని అందుకున్నాడు. అలాగే గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా నిలిచి రూ.10 లక్షలు గెలుచుకున్నాడు.
ఈ సీజన్‌లో ఫీల్డింగ్‌లో అద్భుతమైన విన్యాసం చేసినందుకు గాను మనీష్ పాండేకు క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డుతో పాటు రూ.10 లక్షల నగదు లభించింది. ఇక టోర్నమెంట్ మొత్తంలో అత్యంత క్రమశిక్షణతో, క్రీడాస్ఫూర్తితో ఆడినందుకు గాను పంజాబ్ కింగ్స్ జట్టుకు ఫేర్ ప్లే అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి రూ.10 లక్షల బహుమతిని అందజేశారు.
ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఆర్సీబీ బౌలర్ల దాటికి కేవలం 155 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఈ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు కేవలం 5 వికెట్లు కోల్పోయి, మరో 12 బంతులు మిగిలి ఉండగానే చాలా సులువుగా ఛేదించింది. ఆర్సీబీ రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ 75 పరుగుల క్లాసిక్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించి, ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టోర్నమెంట్ మొత్తంలో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకుని ఐపీఎల్ 2026 కు అసలైన స్టార్‌గా నిలిచాడు.




