Qualifier 1 Sentiment: ఐపీఎల్‌ టైటిల్ సెంటిమెంట్‌.. మరోసారి రిపీట్ అవుతుందా?

IPL 2026 Qualifier 1 Sentiment. ప్లేఆఫ్స్ వేళ ఐపీఎల్‌లో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్‌ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Rishvik
Published on: 26 May 2026 7:14 PM IST
Qualifier 1 Sentiment
X

Qualifier 1 Sentiment: ఐపీఎల్‌ టైటిల్ సెంటిమెంట్‌.. మరోసారి రిపీట్ అవుతుందా?

Qualifier 1 Sentiment: ఎన్నో హోరాహోరీ పోరాటాలతో రసవత్తరంగా సాగిన ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. మంగళవారం జరగబోయే అత్యంత కీలకమైన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్‌ టైటాన్స్‌ (జీటీ) జట్లు తలపడనున్నాయి. సమవుజ్జీలుగా కనిపిస్తోన్న ఈ రెండు జట్ల మధ్య ధర్మశాల వేదికగా రసవత్తర పోరు సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఓడిన జట్టు ఫైనల్ స్థానం కోసం ఎలిమినేటర్‌ (రాజస్థాన్‌ వర్సెస్ హైదరాబాద్‌) మ్యాచ్ విజేతతో క్వాలిఫయర్-2లో తలపడుతుంది.

ప్లేఆఫ్స్ ప్రారంభమైన వేళ ఐపీఎల్‌లో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్‌ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే 'క్వాలిఫయర్‌-1 ఫలితం'. ఇందులో గెలిచిన జట్టే టైటిల్ గెలుస్తుందా? అంటే.. గత చరిత్ర అవుననే సమాధానం చెబుతోంది. ఐపీఎల్‌లో 2011 నుంచి ప్లేఆఫ్స్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు 15 సీజన్‌లు జరగ్గా.. అందులో ఏకంగా 12 సార్లు క్వాలిఫయర్‌-1లో గెలిచిన జట్టే ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకోవడం విశేషం. 2013, 2016, 2017 సీజన్‌లలో తప్ప.. మిగతా అన్ని సీజన్లలో తొలి క్వాలిఫయర్‌లో విజయం సాధించిన జట్టునే ఐపీఎల్ టైటిల్ వరించింది.

2011, 2018, 2021, 2023 సీజన్‌లలో చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్-1లో గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. 2015, 2019, 2020 సీజన్‌లలో ముంబై ఇండియన్స్ తొలి క్వాలిఫయర్‌లో విజయం సాధించి.. ఫైనల్‌లో కూడా గెలిచింది. 2012, 2014, 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్.. 2022లో గుజరాత్ టైటాన్స్ కూడా ఇలానే టైటిల్ సొంతం చేసుకున్నాయి. చివరకు 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫయర్-1లో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుపై గెలిచి మొదటిసారి కప్ అందుకుంది.

గత 15 సీజన్లలో కేవలం 2013, 2016, 2017 సంవత్సరాలలో మాత్రమే ఈ క్వాలిఫయర్-1 సెంటిమెంట్ తప్పింది. మూడు జట్లు క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఓడిపోయినా.. పట్టువదలకుండా పోరాడి క్వాలిఫయర్-2, ఫైనల్‌లో గెలిచి టైటిల్ అందుకున్నాయి. ఆ మూడు జట్లలో ముంబై ఇండియన్స్ రెండుసార్లు ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓసారి గెలిచింది. ఈ సుదీర్ఘమైన సెంటిమెంట్‌ను బట్టి చూస్తే.. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్ ఎంత ప్రాధాన్యమైనదో అర్థం చేసుకోవచ్చు. మరి ఈసారి క్వాలిఫయర్-1 గెలిచిన జట్టు సెంటిమెంట్‌ను నిజం చేస్తూ ట్రోఫీ వైపు దూసుకెళ్తుందో.. లేదా గత చరిత్ర తిరగబడుతుందో చూడాలి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story