IPL 2026 : గిల్ వీరవిహారంతో రాజస్థాన్ ఖేల్ ఖతం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో టైటిల్ ఫైట్

IPL 2026 : శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఊహించని రీతిలో చెలరేగి రాజస్థాన్ రాయల్స్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.

CR Reddy
Published on: 30 May 2026 6:58 AM IST
gt vs rr
X

gt vs rr 

IPL 2026 : ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకుంది. లీగ్ అంతటా అద్భుత ప్రదర్శన చేసిన రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం క్వాలిఫైయర్-2లో ముగిసింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఊహించని రీతిలో చెలరేగి రాజస్థాన్ రాయల్స్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ చరిత్రలో కేవలం 5 సీజన్లలోనే మూడోసారి ఫైనల్స్ లోకి అడుగుపెట్టి రికార్డు సృష్టించింది. మే 31న జరగబోయే గ్రాండ్ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో గుజరాత్ టైటిల్ పోరులో తలపడనుంది. రాజస్థాన్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో (104) ఊపిరిసెలపకుండా చేసి గుజరాత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

న్యూ చండీగఢ్ మైదానంలో జరిగిన ఈ చావో రేవో పోరులో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్ తరహాలోనే భారీ స్కోరు చేయాలనేది రాజస్థాన్ ప్లాన్. అయితే, గుజరాత్ బౌలర్లు పదునైన బంతులతో రాజస్థాన్‌ను ఆరంభంలోనే దెబ్బకొట్టారు. కేవలం మొదటి 2 ఓవర్లలోనే ప్రమాదకరమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ రియాన్ పరాగ్‌ల వికెట్లను రాజస్థాన్ కోల్పోయింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడిలోకి జారుకుంది.

కష్టాల్లో పడిన జట్టును యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అండగా నిలిచి కాపాడాడు. ఈ మ్యాచ్‌లో అతను తన సహజసిద్ధమైన దూకుడును కాస్త తగ్గించి, సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా (45 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నిలకడగా ఆడుతూనే స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ఈ సీజన్‌లో వైభవ్ తన ఐదో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే, వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా అతను సెంచరీకి చేరువగా వచ్చి అవుట్ కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కేవలం 47 బంతుల్లో 96 పరుగుల వద్ద థర్డ్ మ్యాన్ స్థానంలో క్యాచ్ ఇచ్చి వైభవ్ అవుట్ అయ్యాడు. సెంచరీ మిస్ అవ్వడంతో అతను కన్నీళ్లతో మైదానాన్ని వీడాడు.

వైభవ్ అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో డోనోవన్ ఫెరీరా పూనకం వచ్చినట్లు బ్యాటింగ్ చేశాడు. గుజరాత్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఏకంగా 4 భారీ సిక్సర్లు బాదాడు. కేవలం 11 బంతుల్లోనే 38 పరుగులతో అజేయంగా నిలిచి రాజస్థాన్ రాయల్స్ స్కోరును నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగుల భారీ స్థాయికి చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో జేసన్ హోల్డర్, కగిసో రబాడ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ అంతకుముందు ఎప్పుడూ కూడా 210 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించలేదు. గతంలో అలాంటి 7 సందర్భాల్లోనూ గుజరాత్ ఓటమిపాలైంది. ఈ రికార్డును తిరగరాయడానికి గుజరాత్‌కు బలమైన ఓపెనింగ్ అవసరమైంది. అయితే, మ్యాచ్ ప్రారంభంలో రాజస్థాన్ ఫీల్డర్ డోనోవన్ ఫెరీరా ఒక ఘోరమైన తప్పు చేశాడు. సాయి సుదర్శన్ కేవలం 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ఫెరీరా నేలపాలు చేశాడు. ఈ ఒక్క క్యాచ్ డ్రాప్ రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కలలను పూర్తిగా ముంచేసింది.

క్యాచ్ డ్రాప్ ద్వారా లైఫ్ లభించిన సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సుదర్శన్ కేవలం 26 బంతుల్లో, గిల్ 30 బంతుల్లో తమ అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి కేవలం 13 ఓవర్లలోనే ఏకంగా 167 పరుగుల భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి రాజస్థాన్‌ను మ్యాచ్ రేసు నుంచి పూర్తిగా పక్కకు నెట్టేశారు. అయితే, సాయి సుదర్శన్ (58 పరుగులు) వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా దురదృష్టవశాత్తూ హిట్ వికెట్ రూపంలో అవుట్ కావడం విశేషం.

ఒకవైపు వికెట్ పడినా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో తన రెండో సెంచరీ నమోదు చేస్తూ మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్ వైపు తిప్పేశాడు. గిల్ కేవలం 53 బంతుల్లో 104 పరుగుల క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా మిగిలిన పనిని పూర్తి చేశారు. గుజరాత్ టైటాన్స్ కేవలం 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story