చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో.. ఒకే మ్యాచ్‌లో రెండు భారీ రికార్డులపై కన్నేసిన బుడ్డోడు..!
Vaibhav Suryavanshi: ఈ కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం తన జట్టును గెలిపించడమే కాకుండా, వ్యక్తిగతంగా సరికొత్త చరిత్రను లిఖించేందుకు సిద్ధమయ్యాడు.
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో.. ఒకే మ్యాచ్‌లో రెండు భారీ రికార్డులపై కన్నేసిన బుడ్డోడు..!
IPL 2026 Qualifier 2 Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ క్షణాలు క్రికెట్ ప్రియుల్లో గుండె దడ పెంచుతున్నాయి. నేడు న్యూ చండీగఢ్‌లోని ముల్లాంపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫైయర్-2 మహా సంగ్రామం జరగనుంది. ఈ రసవత్తర పోరులో రాజస్థాన్ రాయల్స్ సంచలన యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిలిచిపోయే రెండు అద్భుతమైన ప్రపంచ రికార్డులపై కన్నేశాడు.
ఫైనల్ టికెట్ ఎవరికి? అహ్మదాబాద్ పోరుకు అర్హత సాధించేది ఎవరు?
క్రికెట్ ప్రపంచమంతా ఇప్పుడు సరికొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలవబోతోంది. నేడు ముల్లాంపూర్ వేదికగా జరిగే ఈ చావో రేవో తేల్చుకునే మ్యాచ్‌లో గెలిచిన జట్టు, ఆదివారం (మే 31న) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ పోరులో తలపడుతుంది. ఈ కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం తన జట్టును గెలిపించడమే కాకుండా, వ్యక్తిగతంగా సరికొత్త చరిత్రను లిఖించేందుకు సిద్ధమయ్యాడు. మైదానంలోకి అడుగుపెడితే చాలు ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం వణికించే ఈ యువ ఆటగాడు, నేటి మ్యాచ్ ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అరుదైన మైలురాళ్లను అందుకోనున్నాడు.
ప్రపంచంలోనే రెండో అత్యంత వేగవంతమైన వెయ్యి పరుగులు!
ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఆడిన 22 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో 932 పరుగులు సాధించాడు. నేడు గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను మరో 68 పరుగులు చేస్తే, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని అధిగమించిన ప్రపంచంలోనే ఉమ్మడి రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం ద్వారా వెస్టిండీస్ దిగ్గజం లెండిల్ సిమన్స్ సరసన వైభవ్ నిలుస్తాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ మార్ష్ 21 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు చేసి అగ్రస్థానంలో ఉండగా, డెవాన్ కాన్వే (24 ఇన్నింగ్స్‌లు), మాథ్యూ హేడెన్ (25 ఇన్నింగ్స్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
సిక్సర్ల సెంచరీ.. 15 ఏళ్ల వయసులోనే ఆకాశమే హద్దుగా!
వైభవ్ సూర్యవంశీ కేవలం పరుగులు చేయడమే కాదు, క్రీజులోకి వస్తే సిక్సర్ల వర్షం కురిపించడం అతని ప్రత్యేకత. ఇప్పటివరకు ఆడిన 22 ఇన్నింగ్స్‌ల్లోనే అతను ఏకంగా 89 సిక్సర్లు బాదాడు. నేటి మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లపై మరో 11 సిక్సర్లు బాదితే, ఐపీఎల్ కెరీర్‌లో 100 సిక్సర్ల మార్కును దాటిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కుతాడు. 42.36 అద్భుతమైన సగటుతో, 231.85 సుడిగాలి స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్న ఈ బిహార్ యువ కిశోరం ఖాతాలో ఇప్పటికే 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో అతని అత్యధిక స్కోరు 103 పరుగులు కావడం విశేషం.
చిన్న వయసులోనే అసాధారణమైన ప్రతిభతో ప్రపంచ క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ, నేటి మ్యాచ్‌లో ఈ రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకుని రాజస్థాన్ రాయల్స్ జట్టును ఫైనల్‌కు చేర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకునే ఈ యువ సంచలనం నేడు ముల్లాంపూర్ మైదానంలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.




