Vaibhav Suryavanshi: ఇదేం కొట్టుడు భయ్యా.. పంజాబ్ కోటలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

Vaibhav Suryavanshi: ముల్లాన్‌పుర్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Naresh.k
Published on: 29 April 2026 8:18 AM IST
Vaibhav Suryavanshi
X

Vaibhav Suryavanshi

RR vs PBKS: ఐపీఎల్ 2026 సీజన్‌లో క్రికెట్ ప్రేమికులకు అసలైన మజా లభించింది. ముల్లాన్‌పుర్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ పరుగుల వర్షాన్ని కురిపించింది. 445 పరుగులు నమోదైన ఈ హై-స్కోరింగ్ థ్రిల్లర్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. పంజాబ్ నిర్దేశించిన 223 పరుగుల కొండంత లక్ష్యాన్ని రాజస్థాన్ బ్యాటర్లు ఊపిరిబిగబట్టే ఉత్కంఠ మధ్య ఛేదించి, 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలకు బ్రేక్ పడగా, ఈ సీజన్‌లో వారికి ఇదే తొలి పరాజయం.

పంజాబ్ బ్యాటర్ల ఊచకోత

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (59) మెరుపు హాఫ్ సెంచరీతో పునాది వేయగా, చివర్లో మార్కస్ స్టోయినిస్ ముల్లాన్‌పుర్ స్టేడియంను సిక్సర్లతో హోరెత్తించాడు. కేవలం 22 బంతుల్లోనే 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్, కూపర్ కానెల్లీ కూడా మెరుపులు మెరిపించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో యశ్‌రాజ్ పుంజ రెండు వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు.

రాజస్థాన్ రాయల్' ఛేజింగ్.. సూర్యవంశీ సంచలనం

223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు యశస్వి జైస్వాల్ (51) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. కేవలం 16 బంతుల్లోనే 5 కళ్లు చెదిరే సిక్సర్లతో 43 పరుగులు చేసి మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పేశాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో ఫెర్రీరా (52) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించగా, శుభమ్ దూబె (31) ఫినిషర్ రోల్‌లో మెరిశాడు. వీరిద్దరూ అజేయంగా నిలిచి మరో 4 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు.

చాహల్ పోరాటం వృథా..

పంజాబ్ బౌలర్లలో సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ, ఇతర బౌలర్ల నుంచి సహకారం లభించలేదు. రాజస్థాన్ బ్యాటర్ల ధాటికి పంజాబ్ బౌలింగ్ లైనప్ తేలిపోయింది. మొత్తానికి బ్యాటింగ్‌కు స్వర్గధామంలా మారిన ముల్లాన్‌పుర్ పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్ తమ సత్తా చాటి, పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story