IPL 2026 : 18 ఏళ్ల శాపం తర్వాత ఒక్క అద్భుత విజయం.. ఈసారి గుజరాత్‌పై ఆర్సీబీ హిస్టరీ రిపీట్ చేస్తుందా?

IPL 2026 : రజత్ పాటిదార్ కెప్టెన్సీలో లీగ్ స్టేజ్‌లోనే 14 మ్యాచ్‌లకు గాను 9 విజయాలు, 18 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచిన ఆర్సీబీ.. మే 31న జరగబోయే గ్రాండ్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తోనే మరోసారి తేల్చుకోనుంది.

CR Reddy
Published on: 31 May 2026 6:23 AM IST
RCB vs GT
X

 RCB vs GT

IPL 2026 : క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉన్న ఫ్రాంచైజీలలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ఫామ్‌తో దూసుకుపోతోంది. క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించి ఈ సీజన్‌లో గర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టిన మొదటి జట్టుగా నిలిచింది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో లీగ్ స్టేజ్‌లోనే 14 మ్యాచ్‌లకు గాను 9 విజయాలు, 18 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచిన ఆర్సీబీ.. మే 31న జరగబోయే గ్రాండ్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తోనే మరోసారి తేల్చుకోనుంది. ఈ క్రేజీ ఫైనల్ పోరుకు ముందు, అసలు ఐపీఎల్ చరిత్రలోనే బెంగళూరు జట్టుకు ఉన్న ఫైనల్స్ రికార్డ్ ఏంటి? గతంలో ఎన్నిసార్లు ఫైనల్స్ ఆడి ఓడింది? ఎప్పుడు కప్ గెలిచింది? అనే ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు మొత్తం నాలుగు సార్లు ఫైనల్ మ్యాచ్‌లు ఆడింది. అయితే మొదటి మూడు సార్లు ఆర్సీబీని దురదృష్టం ఘోరంగా వెంటాడింది. 2009, 2011, 2016 సీజన్లలో బెంగళూరు జట్టు ఫైనల్స్ చేరినప్పటికీ, తుది పోరులో తడబడి రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కప్ గెలవాలనే ఫ్యాన్స్ కల ప్రతిసారీ చేజారిపోవడంతో ఆర్సీబీపై కప్ లేని జట్టు అనే ముద్ర బలంగా పడిపోయింది. ఎట్టకేలకు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గత ఏడాది అంటే ఐపీఎల్ 2025 సీజన్‌లో బెంగళూరు జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్లో చిత్తు చేసి ఆర్సీబీ తన మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. రజత్ పాటిదార్ నాయకత్వంలోనే జట్టు ఆ నెక్స్ట్ లెవెల్ ఘనతను సాధించింది. ఈసారి కూడా పాటిదార్ కెప్టెన్సీలోనే జట్టు ఫైనల్‌కు చేరడం విశేషం. గత ఏడాది ఏ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో అయితే కప్ గెలిచారో, ఇప్పుడు అదే స్టేడియంలో మళ్లీ ఫైనల్ ఆడుతుండటం ఆర్సీబీ ఫ్యాన్స్‌లో భారీ ఆశలు రేకెత్తిస్తోంది.

ఐపీఎల్‌లోకి 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టు అడుగుపెట్టినప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య రైవల్రీ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో 9 సార్లు ముఖాముఖి తలపడగా.. అందులో బెంగళూరు 5 మ్యాచ్‌ల్లో గెలిచి పైచేయి సాధించగా, గుజరాత్ 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇటీవల ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లోనూ గుజరాత్‌ను 92 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ ఓడించి ఫైనల్‌కు దూసుకొచ్చింది. మొత్తంగా అహ్మదాబాద్ మైదానంలో ఆర్సీబీ జట్టు ఇప్పటివరకు 8 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడింది. అందులో 4 విజయాలు, 4 ఓటములతో సమానమైన రికార్డును కలిగి ఉంది. అయితే ఇక్కడ ప్లేఆఫ్స్ విషయానికి వస్తే మూడు మ్యాచ్‌లలో రెండింటిలో ఓడి, కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. కానీ ఆ ఒక్క గెలుపు గత ఏడాది జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కావడం గమనార్హం. కాబట్టి నాకౌట్ ఒత్తిడిని ఎలా జయించాలో బెంగళూరుకు బాగా తెలుసు.

ఈ సీజన్‌లో ఆర్సీబీ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అత్యంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. జట్టులో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి లెజెండరీ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. గత ఏడాది ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన కృనాల్ పాండ్యా ఈ సీజన్లోనూ 13 వికెట్లతో రాణిస్తున్నాడు. వీరికి తోడు అన్‌క్యాప్డ్ యువ పేసర్ రసిఖ్ సలామ్ ఈ ఏడాది ఆర్సీబీ తరఫున రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి గుజరాత్ బ్యాటర్లను భయపెడుతున్నాడు. ఈ బలమైన లైనప్ చూస్తుంటే ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని డిఫెండ్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story