IPL 2026 : ఆర్సీబీ పై పగ తీర్చుకునేందుకు గుజరాత్ రెడీ.. బెంగుళూరుకు తప్పని టెన్షన్

IPL 2026 : అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన గత మ్యాచ్‌లో బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

CR Reddy
Published on: 31 May 2026 6:29 AM IST
IPL 2026 : ఆర్సీబీ పై పగ తీర్చుకునేందుకు గుజరాత్ రెడీ.. బెంగుళూరుకు తప్పని టెన్షన్
X

IPL 2026 : ఐపీఎల్ 2026 మహాసంగ్రామం క్లైమాక్స్‌కు వచ్చేసింది. మే 31 ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), హోమ్ టీమ్ గుజరాత్ టైటాన్స్ (GT)ల మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మెగా ఫైనల్‌కు ముందు.. అహ్మదాబాద్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్ ఫలితం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సీజన్లో అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన చివరి ముఖాముఖి పోరులో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది. దీంతో ఈసారి కూడా తమ సొంత మైదానంలో బెంగళూరును మట్టికరిపించి రెండోసారి ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకుపోవాలని శుభ్‌మన్ గిల్ సేన పట్టుదలతో ఉంది.

అహ్మదాబాద్‌లో జరిగిన ఆ లాస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుని బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. గుజరాత్ బౌలర్ కాగిసో రబడా వేసిన ఓవర్లో వరుసగా 5 ఫోర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. కోహ్లీ ఊపు చూసి ఆర్సీబీ భారీ స్కోరు చేయడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ, బెంగళూరు జట్టు ఆ జోరును ఎక్కువసేపు కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని ఆర్సీబీ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు.

మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ కేవలం 13 బంతుల్లో 28 పరుగులు చేసి రబడా బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. మరోవైపు మహ్మద్ సిరాజ్ కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆ దశలో దేవదత్ పడిక్కల్ 24 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టును ఆదుకోవడానికి గట్టిగానే పోరాడాడు. కానీ గుజరాత్ బౌలర్ల సమిష్టి ధాటికి బెంగళూరు తలవంచక తప్పలేదు. గుజరాత్ బౌలర్ అర్షద్ ఖాన్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కేవలం 19 పరుగులిచ్చి 2 వికెట్లతో ఆర్సీబీ నడుము విరిచాడు. దీంతో బెంగళూరు టీమ్ 19.2 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది.

156 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 18 బంతుల్లోనే 43 పరుగులతో విరుచుకుపడగా, జోస్ బట్లర్ 19 బంతుల్లో 39 పరుగులు చేసి బెంగళూరుకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరి ధాటికి గుజరాత్ స్కోరు 7.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 92 పరుగులకు చేరింది. ఆ తర్వాత రాహుల్ తెవాటియా 17 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు. గుజరాత్ జట్టు 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

అహ్మదాబాద్ లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ గెలిచినప్పటికీ.. ఆ తర్వాత జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ఆర్సీబీ ఘోరంగా ప్రతీకారం తీర్చుకుంది. ధర్మశాలలో జరిగిన ఆ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ కేవలం 33 బంతుల్లో 9 భారీ సిక్సర్లతో 93 పరుగులు చేసి గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. దాంతో ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఛేజింగ్‌లో గుజరాత్ 162 పరుగులకే ఆలౌట్ అయి 92 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు అదే క్వాలిఫైయర్-1 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని గుజరాత్ చూస్తోంది.

గత ఏడాది (2025) తన 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ సీజన్‌లోనూ లీగ్ టేబుల్‌లో 18 పాయింట్లతో టాప్‌లో నిలిచి సత్తా చాటింది. ఒకవేళ ఆదివారం జరగబోయే ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి ఆర్సీబీ కప్ గెలిస్తే.. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్ డిఫెండ్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సరసన బెంగళూరు కూడా నిలుస్తుంది. ఈ సీజన్లో ఇరుజట్లు తలపడిన 3 మ్యాచ్‌లలో ఆర్సీబీ రెండు, గుజరాత్ ఒకటి గెలిచాయి. మరి ఈ ఫైనల్ ఫైట్‌లో గెలిచి సీజన్‌ను 2-2 తో సమం చేసి గుజరాత్ కప్ కొడుతుందో లేదో చూడాలి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story