IPL 2026: మావోడే వెన్నుపోటు పొడిచాడు.. మేం ప్లేఆఫ్స్ చేరాలంటే ఇక కావ్యపాప కరుణించాల్సిందే..!

Ruturaj Gaikwad Post Match Comments: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంటున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Venkat
Published on: 16 May 2026 11:01 AM IST
IPL 2026
X

IPL 2026: మావోడే వెన్నుపోటు పొడిచాడు.. మేం ప్లేఆఫ్స్ చేరాలంటే ఇక కావ్యపాప కరుణించాల్సిందే..!

Ruturaj Gaikwad Post Match Comments: లక్నో వేదికగా జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును డెవాల్డ్ బ్రెవిస్, కార్తీక్ శర్మ ఆదుకున్నారు. ముఖ్యంగా కార్తీక్ శర్మ కేవలం 42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చివర్లో శివమ్ దూబే మెరుపులు మెరిపించడంతో చెన్నై భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.

మిచెల్ మార్ష్ విధ్వంసం.. లక్నో ఘనవిజయం..

188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోస్ ఇంగ్లీస్ తొలి వికెట్‌కు 135 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిచెల్ మార్ష్ కేవలం 38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 పరుగులు చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. సీఎస్‌కే ప్రధాన బౌలర్ అన్షుల్ కాంబోజ్ వేసిన ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు బాది మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. దీంతో చెన్నై ఓటమికి అన్షుల్ కాంబోజ్ కారణమయ్యాడు. కేవలం 16.4 ఓవర్లలోనే లక్నో లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్ల తేడాతో విజయం అందుకుంది.

ఎక్కడ తప్పు జరిగిందంటే?

మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్, లక్నో బ్యాటర్ల ప్రతిభను కొనియాడారు. "మేము బ్యాటింగ్ చేసే సమయంలో బంతి సరిగ్గా బ్యాట్‌కు రావడం లేదు, కానీ లక్నో బ్యాటర్లు మాత్రం అసాధారణ షాట్లతో చెలరేగిపోయారు" అని పేర్కొన్నాడు. బౌలింగ్‌లో ఎగ్జిక్యూషన్ లోపించిందని, ముఖ్యంగా మిచెల్ మార్ష్ షార్ట్ పిచ్ బంతులను చాలా చక్కగా ఎదుర్కొన్నారని ఆయన అభిప్రాయపడ్డాడు.

ప్లే-ఆఫ్ చేరుకోవాలంటే?

ప్రస్తుతం చెన్నై పరిస్థితి 'డూ ఆర్ డై' లా మారింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే-ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. మే 18న స్వదేశీ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్ తమకు ఎంతో కీలకమని, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో బలంగా పుంజుకుంటామని రుతురాజ్ ధీమా వ్యక్తం చేశాడు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పులను సరిదిద్దుకుని పునరాగమనం చేస్తామని స్పష్టం చేశాడు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story