Heinrich Klaasen: సంజూ శామ్సన్‌పై ఉమ్మివేసిన క్లాసెన్.. వీడియో వైరల్!

Heinrich Klaasen: స్టంప్ అవుట్ అయిన కోపంలో సంజూ శామ్సన్ వైపు చూస్తూ ఉమ్మివేసిన క్లాసెన్.

Naresh.k
Published on: 19 May 2026 9:40 AM IST
Heinrich Klaasen
X

Heinrich Klaasen: సంజూ శామ్సన్‌పై ఉమ్మివేసిన క్లాసెన్.. వీడియో వైరల్!

Sanju Samson: క్రికెట్ మైదానంలో సాధారణంగా ఎంతో ప్రశాంతంగా, కూల్‌గా కనిపించే ఆటగాళ్లు ఇద్దరు. ఒకరు చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ సంజూ శామ్సన్, మరొకరు సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్. కానీ, ఐపీఎల్ 2026 సీజన్ 63వ మ్యాచ్‌లో ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒక ఊహించని ఘర్షణ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. ఒక వికెట్ విషయంలో మొదలైన వివాదం.. చివరకు క్లాసెన్ ఉమ్మివేసే స్థాయికి వెళ్లడం క్రీడాకారుల ప్రవర్తనపై తీవ్ర చర్చకు దారితీసింది.

చెన్నై విధించిన 181 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తోంది. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్‌లో 15వ ఓవర్‌లో నూర్ అహ్మద్ వేసిన మూడో బంతిని క్లాసెన్ భారీ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు. అంతే.. వెనక ఉన్న సంజూ శామ్సన్ మెరుపు వేగంతో బంతిని అందుకుని స్టంప్స్ ఎగరగొట్టాడు. రిప్లేలో క్లాసెన్ కాలు కొంచెం గాలిలో ఉన్నట్లు స్పష్టంగా కనిపించడంతో థర్డ్ అంపైర్ అవుట్ అని ప్రకటించాడు. కానీ, తాను అవుట్ కాదని క్లాసెన్ బలంగా నమ్మాడు. సరిగ్గా అదే సమయంలో వికెట్ తీసిన జోష్‌లో శామ్సన్.. క్లాసెన్ వైపు సీరియస్‌గా చూడటంతో దక్షిణాఫ్రికా బ్యాటర్‌కు ఒక్కసారిగా కోపం నరాలకెగసింది. ఇద్దరి మధ్య మైదానంలోనే తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అంపైర్లు, తోటి ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పినా క్లాసెన్ ఆగ్రహం తగ్గలేదు.

వివాదం అక్కడితో ముగిసిపోలేదు. తీవ్ర అసహనంతో పెవిలియన్ వైపు వెళ్తున్న క్లాసెన్.. ఒక్కసారిగా వెనక్కి తిరిగి సంజూ శామ్సన్ వైపు చూస్తూ అసహ్యంగా ఉమ్మి వేశాడు. ఈ దృశ్యాలు లైవ్ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. జెంటిల్‌మన్ గేమ్‌గా పిలిచే క్రికెట్‌లో.. అదీ క్లాసెన్ లాంటి వరల్డ్ క్లాస్ ప్రొఫెషనల్ ప్లేయర్ ఇంత చౌకబారుగా ప్రవర్తించడాన్ని నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

నిజానికి ఈ మ్యాచ్‌లో క్లాసెన్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న చెన్నై పిచ్‌పై కేవలం 26 బంతుల్లో 47 పరుగులు చేసి మ్యాచ్‌ను హైదరాబాద్ వైపు తిప్పాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి 75 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు. 13 మ్యాచ్‌ల్లో 555 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ స్కోరర్‌గా దూసుకుపోతున్నాడు. 180కి పైగా విధ్వంసకర స్ట్రైక్ రేట్‌తో చెలరేగుతున్నాడు. అయితే, బ్యాట్‌తో ఎంత రికార్డులు సృష్టించినా.. శామ్సన్‌తో పెట్టుకున్న ఈ గొడవ, మైదానంలో ఉమ్మివేసిన ఘటన క్లాసెన్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. ఇప్పుడు ఆయన సాధించిన పరుగుల కంటే ఈ వివాదమే ఎక్కువగా మార్మోగిపోతోంది.

క్రికెట్ మైదానంలో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘించిన క్లాసెన్‌పై బీసీసీఐ ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ ఫీజులో 100% కోత విధిస్తారా? లేక ఒకటి రెండు మ్యాచ్‌ల పాటు నిషేధం విధిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ నిషేధం పడితే ప్లేఆఫ్స్ చేరే క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు ఇది కోలుకోలేని దెబ్బ అవుతుందనడంలో సందేహం లేదు.




Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story