క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మారిన ఐపీఎల్ 2027 షెడ్యూల్.. కొత్త తేదీలు ఇవే..!

IPL 2027 Schedule: సాధారణంగా ప్రతి ఏటా మార్చి చివరి వారంలో ప్రారంభమై, మే ముగింపులో లేదా జూన్ మొదటి వారంలో ఐపీఎల్ ముగుస్తుంది.

Venkat
Published on: 18 Jun 2026 1:41 PM IST
IPL 2027 Schedule
X

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మారిన ఐపీఎల్ 2027 షెడ్యూల్.. కొత్త తేదీలు ఇవే..!

IPL 2027 Schedule: క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అభిమానుల ఉత్సాహాన్ని, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది జరగబోయే 20వ ఎడిషన్ షెడ్యూల్‌లో బీసీసీఐ కీలక మార్పులు చేస్తూ కొత్త తేదీలను అధికారికంగా ప్రకటించింది.

ఎండ దెబ్బకు లీగ్ ప్రీపోన్.. సరికొత్త విండో..!

గడిచిన కొన్ని సీజన్లుగా మే నెల చివరి వారంలో ముదురుతున్న ఎండలు, అకాల వర్షాలు ఐపీఎల్ మ్యాచ్‌లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. స్టేడియానికి వచ్చే అభిమానులు సైతం తీవ్రమైన ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆటగాళ్లకు శారీరక ఇబ్బందులు కలగకుండా, అభిమానులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేందుకు లీగ్‌ను రెండు వారాల ముందే ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గురువారం ఒక ప్రకటనలో స్పష్టతనిచ్చారు.

మార్చి 10 నుంచే ఐపీఎల్ హంగామా..

సాధారణంగా ప్రతి ఏటా మార్చి చివరి వారంలో ప్రారంభమై, మే ముగింపులో లేదా జూన్ మొదటి వారంలో ఐపీఎల్ ముగుస్తుంది. కానీ, వచ్చే 2027 సీజన్ మాత్రం రెండు వారాల ముందే, అంటే మార్చి 10 నుంచే షురూ కానుంది. రెండు నెలల ఏడు రోజుల పాటు సుదీర్ఘంగా సాగే ఈ మెగా టోర్నీ మే 15 కల్లా ముగిసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మే మధ్యలోనే ఫైనల్ మ్యాచ్ ముగిసిపోవడం వల్ల వర్షాల ముప్పు, అలాగే తీవ్రమైన ఎండల తీవ్రత నుంచి టోర్నీని కాపాడుకోవచ్చని బోర్డు భావిస్తోంది.

మ్యాచ్‌ల పెంపుకు చెక్.. పాత పద్ధతిలోనే సమరం..

ఐపీఎల్ క్రేజ్ దృష్ట్యా మ్యాచ్‌ల సంఖ్యను పెంచుతారనే ప్రచారం గత కొంతకాలంగా గట్టిగా సాగుతోంది. ప్రతి జట్టు స్వదేశంలో, విదేశంలో మరిన్ని మ్యాచ్‌లు ఆడేలా గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లను 14 నుంచి 18కి పెంచుతారనే ఊహాగానాలకు దేవజిత్ సైకియా తెరదించారు. మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 94కి పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి విదేశీ బోర్డుల ఆటగాళ్ల లభ్యతను, అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. దీంతో రాబోయే సీజన్ కూడా పాత ఫార్మాట్ లోనే రసవత్తరంగా సాగనుంది.

బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఆట నాణ్యతను పెంచడమే కాకుండా, ఎండల తీవ్రత నుంచి అటు ఆటగాళ్లకు, ఇటు స్టేడియంకు వచ్చే ప్రేక్షకులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది. మార్చి 10న ప్రారంభం కానున్న ఈ సరికొత్త క్రికెట్ పండగ కోసం అభిమానులు ఇప్పటి నుంచే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story