IPL Media Rights: ఇప్పటికే రూ.48 వేల కోట్లు, ఇంకా 30 శాతం పెరుగుదల.. విషయం చెప్పేసిన ఐపీఎల్ ఓనర్!
IPL Media Rights: ఐపీఎల్ మీడియా రైట్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పంజాబ్ కింగ్స్ సహ యజమాని అభిప్రాయపడ్డారు.
IPL Media Rights: ఇప్పటికే రూ.48 వేల కోట్లు, ఇంకా 30 శాతం పెరుగుదల.. విషయం చెప్పేసిన ఐపీఎల్ ఓనర్!
IPL Media Rights: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్‌కు భారీ స్థాయిలో ఫాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ క్రీడా రంగంలో భారీ బ్రాండ్‌గా ఎదిగింది. ప్రస్తుతం 2023-2027 చక్రానికి సంబంధించిన ఐపీఎల్ మీడియా హక్కులు సుమారు రూ.48 వేల కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే. అయితే వచ్చే మీడియా రైట్స్ సైకిల్‌లో ఈ విలువ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పంజాబ్ కింగ్స్ సహ యజమాని మోహిత్ బర్మన్ అభిప్రాయపడ్డారు. రానున్న ఒప్పందంలో 20 నుంచి 30 శాతం వరకు పెరుగుదల వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
'ఇటీవల రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలకు కొత్త ఇన్వెస్టర్లు భారీ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం ఐపీఎల్ మార్కెట్ విలువను మరింత పెంచింది. రాజస్థాన్ సుమారు 1.65 బిలియన్ డాలర్లు, ఆర్సీబీ 1.78 బిలియన్ డాలర్ల విలువతో పెట్టుబడి దారులను ఆకర్షించాయి. ఈ స్థాయి ఇన్వెస్ట్మెంట్స్ రావడం ఐపీఎల్ భవిష్యత్తుపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది' అని మోహిత్ బర్మన్ చెప్పారు.
ప్రస్తుతం టెలివిజన్ కంటే డిజిటల్ స్ట్రీమింగ్ వైపు ప్రేక్షకుల ఆసక్తి ఉందని ఆయన తెలిపారు. 'మొబైల్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐపీఎల్‌ను వీక్షించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అందుకే భవిష్యత్తులో టీవీ రైట్స్ కంటే డిజిటల్ మీడియా హక్కుల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో చాలా కొద్ది స్పోర్ట్స్ లీగ్‌లే ప్రతి ఏడాది ఇంత స్థాయి ఎంగేజ్‌మెంట్‌ను కొనసాగిస్తాయి. ఐపీఎల్‌కు ప్రేక్షకులు, ప్రకటనదారులు, డిజిటల్ వ్యూస్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి’ అని మోహిత్ బర్మన్ వ్యక్తం చేశారు.
ఐపీఎల్ ఇప్పుడు కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదని.. ఇది ఒక పెద్ద స్పోర్ట్స్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ బ్రాండ్‌గా మారిందని మోహిత్ బర్మన్ చెప్పారు. 'ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలను ఎన్బీఏ, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్), ఎన్ఎఫ్ఎల్ జట్లతో పోలుస్తున్నారు. గతంలో భారత క్రీడా లీగ్‌లను అంతర్జాతీయ లీగ్‌లతో పోల్చేవారు కాదు.
ఇప్పుడు మాత్రం ఐపీఎల్ ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ లీగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఫ్రాంచైజీల విలువలు, మీడియా హక్కుల విలువ మధ్య నేరుగా సంబంధం ఉంటుంది. పెట్టుబడిదారులు ఫ్రాంచైజీల్లో భారీ మొత్తాలు పెట్టడానికి సిద్ధపడటం.. లీగ్ భవిష్యత్తుపై వారి విశ్వాసాన్ని సూచిస్తోంది. అదే సమయంలో బ్రాడ్‌కాస్టర్లు, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లు కూడా తమ పెట్టుబడులను పెంచుతున్నాయి' అని బర్మన్ చెప్పుకొచ్చారు.
భవిష్యత్తులో ఐపీఎల్ మరింతగా అభివృద్ధి చెందాలంటే కేవలం మ్యాచ్‌ల సంఖ్య పెరగడం సరిపోదని మోహిత్ బర్మన్ అభిప్రాయపడ్డారు. ఏడాది పొడవునా అభిమానులతో అనుబంధాన్ని పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కేవలం రెండు నెలల పాటు మాత్రమే జరుగుతుండగా.. ఈపీఎల్, ఎన్బీఏ, ఎన్ఎఫ్ఎల్ లాంటి లీగ్‌లు ఏడాది పొడవునా అభిమానులను ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. విదేశాల్లో ఫ్యాన్ ఈవెంట్లు, డిజిటల్ కంటెంట్, అంతర్జాతీయ మార్కెటింగ్ ద్వారా ఐపీఎల్‌ను మరింత గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 94కి పెంచే అవకాశం భవిష్యత్తులో ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్, ఆటగాళ్ల పనిభారం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని మోహిత్ బర్మన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం 10 జట్లతో ఐపీఎల్ సమతూకంగా ఉందని.. కొత్త జట్లను చేర్చే ముందు టాలెంట్, షెడ్యూల్, మార్కెట్ డిమాండ్ అన్నీ సరైన స్థాయిలో ఉన్నాయా లేదా అన్నది చూడాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.




