IPL 2026: ప్లేఆఫ్స్ రేసుతో ఐపీఎల్ టికెట్లకు భారీ డిమాండ్.. ఒక్క టికెట్ ఏకంగా రూ. 80 వేలు

IPL 2026: ఐపీఎల్ సీజన్‌ చివరి దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠగా మార‌డంతో ప్రత్యక్షంగా స్టేడియంలో చూసేందుకు అభిమానులు పోటీపడుతున్నారు.

Mokshith
Published on: 17 May 2026 11:49 AM IST
IPL 2026
X

IPL 2026: ప్లేఆఫ్స్ రేసుతో ఐపీఎల్ టికెట్లకు భారీ డిమాండ్.. ఒక్క టికెట్ ఏకంగా రూ. 80 వేలు

IPL 2026: ఐపీఎల్ సీజన్‌ చివరి దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠగా మార‌డంతో ప్రత్యక్షంగా స్టేడియంలో చూసేందుకు అభిమానులు పోటీపడుతున్నారు. దీంతో టికెట్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఈ పరిస్థితిని కొందరు అక్రమంగా ఉపయోగించుకుంటూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇప్పటికే స‌న్‌రైజ‌ర్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ్యాచ్‌కు టికెట్ ధరలు భారీగా పెరిగిన విషయం చర్చనీయాంశమైంది. మరోవైపు నకిలీ యాప్‌లు, బ్లాక్ మార్కెట్ విక్రయాలతో అభిమానులను మోసం చేసే ఘటనలు కూడా పెరుగుతున్నాయి.

ఢిల్లీ - బెంగళూరు మ్యాచ్ చుట్టూ టికెట్ల దందా

తాజాగా ఢిల్లీ క్యాపిట‌ల్స్, బెంగ‌ళూరు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ వ్యవహారం సంచలనంగా మారింది. కోహ్లీని ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో టికెట్ల కోసం అభిమానులు భారీ మొత్తాలు చెల్లించేందుకు కూడా సిద్ధపడ్డారు.

ఈ పరిస్థితిని కొందరు మధ్యవర్తులు అవకాశంగా మార్చుకున్నారు. సాధారణ ధరలకంటే అనేక రెట్లు ఎక్కువకు టికెట్లను విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. కొన్ని టికెట్లు ఒక్కోటి రూ.80 వేల వరకు అమ్మినట్లు సమాచారం.

కాంప్లిమెంటరీ పాస్‌ల దుర్వినియోగం?

దర్యాప్తులో అత్యంత కీలక అంశంగా కాంప్లిమెంటరీ టికెట్ల వ్యవహారం బయటపడింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన కొంత శాతం టికెట్లు స్థానిక క్రికెట్ సంఘాలకు ఉచిత పాస్‌ల రూపంలో ఇవ్వాలి. సాధారణంగా ఇవి అతిథులు, అధికారులు, ప్రత్యేక ఆహ్వానితుల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది.

అయితే ఢిల్లీలో ఈ కాంప్లిమెంటరీ టికెట్లలో దాదాపు వెయ్యి వరకు బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో స్థానిక క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన కొందరు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్టేడియం వద్దే అరెస్టులు

మ్యాచ్‌కు ముందు స్టేడియం పరిసరాల్లో టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముకీమ్‌, గుర్ఫాన్‌, ఫైసల్‌ అనే వ్యక్తులను మొదట అరెస్టు చేసిన అధికారులు, విచారణలో బయటపడ్డ సమాచారంతో మరో వ్యక్తి పంకజ్‌ యాదవ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో టికెట్ల సరఫరా వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు సీనియర్ అధికారులతో పాటు మరికొందరు ఢిల్లీ క్రికెట్ సంఘం సిబ్బందిని కూడా పోలీసులు గంటల తరబడి విచారించినట్లు సమాచారం.

అభిమానుల ఆవేదన.. కఠిన చర్యల డిమాండ్

ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలని ఆశపడే సాధారణ అభిమానులు ఈ బ్లాక్ టికెట్ వ్యవహారంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు దొరకకపోవడం, దొరికినా అధిక ధరలు ఉండటం వల్ల చాలా మంది నిరాశ చెందుతున్నారు.

ఇక నకిలీ యాప్‌లు, బ్లాక్ మార్కెట్ విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. టికెట్ విక్రయాల్లో పూర్తి పారదర్శకత ఉండేలా బీసీసీఐతో పాటు ఫ్రాంజైజీలు, రాష్ట్ర క్రికెట్ సంఘాలు కఠిన నియంత్రణ వ్యవస్థ తీసుకురావాల్సిన అవసరం ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story