IPL Records : ఐపీఎల్‎లో టాప్-7 రన్ ఛేజెస్.. 250+ స్కోరును రెండుసార్లు ఊదిపారేసిన ఏకైక జట్టు పంజాబ్

IPL Records :265 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసి పంజాబ్ కింగ్స్ సరికొత్త ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో 7 అతిపెద్ద విజయవంతమైన రన్ ఛేజ్‌ల వివరాలు చూద్దాం.

CR Reddy
Published on: 26 April 2026 6:40 AM IST
IPL Records
X

 IPL Records

IPL Records : ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం. కానీ 2026 సీజన్‌లో ఆ ప్రవాహం కాస్తా ఉప్పెనలా మారింది. నిన్నమొన్నటి వరకు 200 పరుగులు చేస్తే చాలు గెలిచేయొచ్చు అనుకునేవారు, కానీ ఇప్పుడు 250 కొట్టినా గ్యారెంటీ లేని పరిస్థితి వచ్చేసింది. తాజాగా పంజాబ్ కింగ్స్ (PBKS) సృష్టించిన విధ్వంసం క్రికెట్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును విజయవంతంగా ఛేదించిన జట్లు ఏవో.. ఆ టాప్-7 రన్ ఛేజ్ లేంటో వివరంగా తెలుసుకుందాం.

పంజాబ్ కింగ్స్ అల్టిమేట్ రికార్డ్

శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ అలవోకగా ఛేదించింది. మొదట ఢిల్లీ బ్యాటర్లు విధ్వంసం సృష్టించి 264 పరుగులు చేసినప్పుడు అందరూ పంజాబ్‌కు ఓటమి ఖాయం అనుకున్నారు. కానీ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (26 బంతుల్లో 76), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 71) ఊచకోత కోశారు. దీంతో పంజాబ్ జట్టు తన పాత రికార్డును (262 రన్స్) తానే బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లో 250 కంటే ఎక్కువ స్కోరును రెండుసార్లు ఛేజ్ చేసిన ఏకైక జట్టుగా పంజాబ్ నిలిచింది.

హైదరాబాద్, బెంగళూరు దూకుడు

ఈ జాబితాలో మూడో స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఉంది. 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పైనే హైదరాబాద్ 247 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా తక్కువేం తినలేదు. గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మీద 230 పరుగుల లక్ష్యాన్ని చేధించి తన బ్యాటింగ్ సత్తాను చాటింది.

రాజస్థాన్ రాయల్స్ అండ్ ముంబై ఇండియన్స్

మొదటి ఐపీఎల్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ (RR) రన్ ఛేజింగ్‌లో ఎప్పుడూ ముందుంటుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మీద 226 రన్స్, అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ మీద 224 రన్స్ ఛేజ్ చేసి రెండుసార్లు టాప్-7 జాబితాలో చోటు దక్కించుకుంది. ఇదే ఏడాది (2026) ముంబై ఇండియన్స్ కూడా కోల్‌కతాపై 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసి ఈ జాబితాలో చేరింది.

ఐపీఎల్ చరిత్రలో టాప్-7 సక్సెస్‌ఫుల్ రన్ ఛేజెస్ లిస్ట్

* 265 పరుగులు: పంజాబ్ కింగ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్‌పై) - 2026

* 262 పరుగులు: పంజాబ్ కింగ్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్‌పై) - 2024

* 247 పరుగులు: సన్‌రైజర్స్ హైదరాబాద్ (పంజాబ్ కింగ్స్‌పై) - 2025

* 230 పరుగులు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (లక్నో సూపర్ జెయింట్స్‌పై) - 2025

* 226 పరుగులు: రాజస్థాన్ రాయల్స్ (పంజాబ్ కింగ్స్‌పై) - 2020

* 224 పరుగులు: రాజస్థాన్ రాయల్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్‌పై) - 2024

* 224 పరుగులు: ముంబై ఇండియన్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్‌పై) - 2026

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story