BCCI Revenue: బీసీసీఐకి ఐపీఎల్‌ బంగారు గని.. ఊహించని ఆదాయం, 2000 శాతం పెరుగుదల!

BCCI Revenue: ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రికెట్ లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముందు వరుసలో ఉంటుంది.

Rishvik
Published on: 4 May 2026 6:21 PM IST
BCCI Revenue
X

BCCI Revenue: బీసీసీఐకి ఐపీఎల్‌ బంగారు గని.. ఊహించని ఆదాయం, 2000 శాతం పెరుగుదల!

BCCI Revenue: ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రికెట్ లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముందు వరుసలో ఉంటుంది. ఐపీఎల్ టోర్నీ ఆటగాళ్లకు మాత్రమే కాదు.. భారత క్రికెట్ మండలి (బీసీసీఐ)కి కూడా భారీ ఆదాయ వనరుగా మారింది. 2008లో ప్రారంభమైన ఈ టోర్నీ.. ప్రతి ఏడాది ఊహించని రీతిలో రెవెన్యూ వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. బీసీసీఐకి ‘క్యాష్ మెషీన్’గా ఐపీఎల్ మారింది.

సమాచారం ప్రకారం 2008లో ఐపీఎల్ మొదటి సీజన్‌లో బీసీసీఐకి సుమారు రూ.645 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఈ ఆదాయం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. 2009లో రూ.1,000 కోట్లు, 2010లో రూ.1,667 కోట్లు వరకు పెరిగింది. మధ్యలో కొంత తగ్గుదల కనిపించింది. 2013లో రూ.1,194 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2018 నాటికి ఈ ఆదాయం రూ.4,000 కోట్లను దాటింది. కోవిడ్-19 ప్రభావం ఉన్నప్పటికీ 2021లో కూడా రూ.3,874 కోట్ల ఆదాయం రావడం ఐపీఎల్ ప్రభావాన్ని స్పష్టంగా చూపించింది.

2022లో రెండు కొత్త జట్లు చేరడంతో ఐపీఎల్ విలువ మరింత పెరిగింది. ఆ ఏడాది బీసీసీఐ ఆదాయం రూ.6,610 కోట్లకు ఎగబాకింది. ఆ తర్వాతి సంవత్సరాల్లో బీసీసీఐకి ఆదాయం మరింత వేగంగా పెరుగుతూ వచ్చింది. 2023లో రూ.11,769 కోట్లు, 2024లో రూ.11,802 కోట్లు, 2025లో రూ.12,005 కోట్లు నమోదు కాగా.. 2026 నాటికి ఈ ఆదాయం సుమారు రూ.13,500 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ సాగుతోంది. లీగ్ దశ చివరికి చేరుకుంది. ఇప్పటికే వ్యూస్ పరంగా రికార్డులు బ్రేక్ చేస్తోంది.

ఈ గణాంకాలను పరిశీలిస్తే.. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ఇప్పటి వరకు బీసీసీఐ ఆదాయం దాదాపు 2000 శాతం పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ విక్రయాలు, బ్రాండ్ విలువ.. అన్ని కలిసి ఐపీఎల్‌ను ఒక భారీ వ్యాపార వేదికగా మార్చాయి. ఐపీఎల్ కేవలం ఒక క్రికెట్ టోర్నీ మాత్రమే కాదు.. భారత క్రికెట్ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా మారింది. భవిష్యత్తులో ఈ లీగ్ మరింత విస్తరిస్తూ బీసీసీఐ ఆదాయాన్ని ఇంకా పెంచే అవకాశం ఉంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story