వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. ఐపీఎల్ స్టార్ క్రికెటర్ అరెస్టు!
Abhishek Porel: IPL cricketer Abhishek Porel has been arrested in Rape case. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ అయ్యాడు.
వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. ఐపీఎల్ స్టార్ క్రికెటర్ అరెస్టు!
Abhishek Porel: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ అయ్యాడు. ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోగ్రా పోలీసులు సోమవారం అర్ధరాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో అభిషేక్ శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఇప్పుడు ముఖం చాటేశాడని సదరు విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం, బెదిరింపుల కేసులో అభిషేక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నేడు కోర్టులో హాజరుపరిచారు.
కర్ణాటకకు చెందిన ఓ వైద్య విద్యార్థిని జూన్ 23న హుగ్లీ జిల్లాలోని మోగ్రా పోలీస్ స్టేషన్‌లో అభిషేక్ పోరెల్‌పై ఫిర్యాదు చేసింది. తామిద్దరం సుమారు మూడున్నరేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్నామని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అభిషేక్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. తామిద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్లినట్లు యువతి తెలిపింది. అయితే గత ఏడాది నుంచి తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని, ఆ తర్వాత అభిషేక్ తనపై దాడికి పాల్పడి బెదిరించినట్లు ఫిర్యాదులో ఆరోపించింది. ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అభిషేక్ పోరెల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. దాంతో బాధితురాలు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. కేసును పరిశీలించిన హైకోర్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్ పోరెల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మోగ్రా పోలీసులు సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటక్స్ ఆటగాడు పోరెల్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 69తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని కొన్ని నిబంధనలను కూడా కేసులో చేర్చినట్లు తెలిపారు.
హుగ్లీ రూరల్ ఎస్పీ కునార్ భూషణ్ సింగ్ మాట్లాడుతూ.. అభిషేక్ పోరెల్‌పై కేసు నమోదైందని, అతడిని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం రాత్రి అభిషేక్‌ను అరెస్ట్ చేశామని, మంగళవారం కోర్టులో హాజరుపరచినట్లు వెల్లడించారు. అయితే కోర్టు అతడికి ఎలాంటి శిక్ష విదించిందో, అభిషేక్ ఏం సమాధానాలు ఇచ్చాడో ఇంకా తెలియాల్సి ఉంది. కేసులో నమోదైన ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు. కోర్టు తుది తీర్పు వెలువడే వరకు పోరెల్‌ను నిందితుడిగానే పరిగణించాలి. కోర్టు విచారణ, దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.
లెఫ్ట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన అభిషేక్ పోరెల్ 2023 నుంచి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్‌లో నాలుగు మ్యాచులలో 108 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026 ముందు భారత్-ఏ జట్టుతో కలిసి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లాడు. అభిషేక్ బెంగాల్ జట్టు తరఫున 2021-22 సీజన్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 32 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 23 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్‌లో ఇప్పుడిపుడే ఎదుగుతున్న సమయంలో అతడిపై నమోదైన ఈ అత్యాచారం, మోసం కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




