Ireland Cricket: టీమిండియాపై చారిత్రక సిరీస్ విజయం.. మరుసటి రోజే ఐర్లాండ్‌కు బిగ్ షాక్!
Ireland Cricket: భారత్‌పై చారిత్రక టీ20 సిరీస్ విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఐర్లాండ్ క్రికెట్‌కు బిగ్ షాక్ తగిలింది.
Ireland Cricket: టీమిండియాపై చారిత్రక సిరీస్ విజయం.. మరుసటి రోజే ఐర్లాండ్‌కు బిగ్ షాక్!
Ireland Cricket: ప్రపంచ ఛాంపియన్ భారత్‌పై చారిత్రక టీ20 సిరీస్ విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఐర్లాండ్ క్రికెట్‌కు బిగ్ షాక్ తగిలింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియాను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన మరుసటి రోజే హెడ్ కోచ్ హెన్రిచ్ మలాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత నాలుగేళ్లకు పైగా ఐర్లాండ్ జట్టుకు మలాన్ సేవలందించాడు. జట్టును ఎన్నో చారిత్రక విజయాల దిశగా నడిపించిచాడు.
నాలుగేళ్ల విజయవంతమైన ప్రయాణానికి ముగింపు:
నిజానికి ఒప్పందం ప్రకారం హెన్రిచ్ మలాన్ 2027 వరకు కొనసాగాల్సి ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఐర్లాండ్ క్రికెట్ భవిష్యత్ కోసం ముందుగానే తపుకున్నాడు. ఇప్పుడు కొత్త కోచ్ బాధ్యతలు చేపట్టి.. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ అర్హతపై దృష్టి సారించడం మంచిదని భావించి తాను తప్పుకుంటున్నట్లు మలాన్ వెల్లడించాడు. తన నిర్ణయాన్ని జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికి భారత్‌తో సిరీస్ ముగిసిన వెంటనే తెలియజేశాడు.
భావోద్వేగంగా స్పందించిన మలాన్:
తన వీడ్కోలు సందేశంలో మలాన్ మాట్లాడుతూ... 'ఈ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, ఐర్లాండ్ క్రికెట్తో కలిసి పనిచేయడం నా జీవితంలో గొప్ప అనుభవం. నా కుటుంబంతో కలిసి ఇక్కడ గడిపిన సమయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఐర్లాండ్ క్రికెట్‌లో భాగమైనందుకు గర్వంగా ఉంది' అని పేర్కొన్నాడు. క్రికెట్ ఐర్లాండ్ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ గ్రేమ్ వెస్ట్ మలాన్ సేవలను ప్రశంసించాడు. క్లిష్ట సమయంలో జట్టులో చేరి, ఆటగాళ్ల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రపంచస్థాయిలో పోటీ పడే జట్టుగా ఐర్లాండ్‌ను తీర్చిదిద్దడంలో మలాన్ కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నాడు. అతని సేవలు ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అభినందించాడు.
ఎన్నో అరుదైన విజయాలు:
మలాన్ హయాంలో ఐర్లాండ్ ఎన్నో అరుదైన విజయాలను నమోదు చేసింది. 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై చారిత్రక విజయం, ఆఫ్ఘనిస్థాన్‌పై తొలి టెస్ట్ విజయం, స్వదేశంలో జింబాబ్వేపై తొలి టెస్ట్ విజయం, ఇప్పుడు భారత్‌పై తొలి అంతర్జాతీయ టీ20 సిరీస్ విజయం ఆయన కోచింగ్ సమయంలో ప్రధాన ఘనతలుగా నిలిచాయి. అలాగే పాకిస్థాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లపై కూడా ఐర్లాండ్ విజయాలు సాధించింది. వరుసగా మూడు టీ20 ప్రపంచకప్‌లకు నేరుగా అర్హత సాధించడంలో కూడా మలాన్ కీలక పాత్ర పోషించాడు.
భారత్‌పై విజయం.. వీడ్కోలుకు ప్రత్యేక గుర్తింపు:
రెండుసార్లు వరుసగా టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుపై ఐర్లాండ్ తొలిసారి అంతర్జాతీయ సిరీస్ గెలిచింది. ఆ విజయాన్ని తన కోచింగ్ కెరీర్‌కు చివరి జ్ఞాపకంగా మలాన్ మలుచుకున్నాడు. ఈ చారిత్రక విజయం తర్వాత ఆయన రాజీనామా చేయడం ఐర్లాండ్ క్రికెట్‌లో ఒక యుగానికి ముగింపు పలికినట్లుగా భావిస్తున్నారు.




