Yashasvi Jaiswal: చేసింది 6 పరుగులే అయినా.. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన జైస్వాల్!
Yashasvi Jaiswal: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతిని సిక్స్ కొట్టాడు.
Yashasvi Jaiswal: చేసింది 6 పరుగులే అయినా.. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన జైస్వాల్!
Yashasvi Jaiswal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బ్యాటర్ల దూకుడు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నింగ్స్ మొదటి బంతినే సిక్సర్‌గా మలచడం అనేది చాలా అరుదైన ఫీట్. అలాంటి ఘనతను ఒకసారి కాదు.. పలుమార్లు సాధించడం అంటే మాటలు కాదు.
ఈ ఘనతను రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఏకంగా నాలుగుసార్లు ఇన్నింగ్స్ మొదటి బంతినే సిక్సర్‌గా బాదాడు. ఈ రికార్డు డాషింగ్ ఓపెనర్లు క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, జోస్ బట్లర్ లాంటి వారికే సాధ్యం కాలేదు. ఇప్పటికే ఈ రికార్డు జైస్వాల్ పేరుపై ఉండగా.. మరింత మెరుగుపర్చుకున్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతిని సిక్స్ కొట్టాడు. ఢిల్లీ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతినే సిక్సర్‌గా మలిచాడు. ఇన్నింగ్స్ మొదటి బంతినే సిక్సర్‌గా మలచడం జైస్వాల్‌కు ఇది నాలుగోసారి.
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి బంతినే జైస్వాల్ భారీ సిక్సర్‌గా బాదాడు. అంతకుముందు రెండుసార్లు ఇలానే కొట్టాడు. అతడి ఆత్మవిశ్వాసం, అటాకింగ్ మైండ్‌సెట్ కారణంగానే ఈ రికార్డు సాధ్యమైంది. యువ ఆటగాడిగా ఇంత నిలకడ, ధైర్యం చూపించడం అద్భుతం అనే చెప్పాలి.
ఈ జాబితాలో రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ఉన్నాడు. అతడు రెండు సార్లు తొలి బంతినే సిక్స్ కొట్టి తన దూకుడు బ్యాటింగ్‌ను చాటుకున్నాడు. మిగతా ఆటగాళ్లు ఒక్కోసారి ఈ ఘనత సాధించారు. రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు నమన్ ఓజా, టీమిండియా స్టార్ మయాంక్ అగర్వాల్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ, భారత మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప, ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్, భారత స్టార్ సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు ఈ జాబితాలో చోటు సంపాదించారు.
ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో మొదటి బంతికి సిక్స్ బాదిన ప్లేయర్స్:
4 - యశస్వి జైస్వాల్
2 - ప్రియాంశ్ ఆర్య
1 - నమన్ ఓజా
1 - మయాంక్ అగర్వాల్
1 - సునీల్ నరైన్
1 - విరాట్ కోహ్లీ
1 - రాబిన్ ఉతప్ప
1 - ఫిల్ సాల్ట్
1 - సంజు శాంసన్




