Jaspal Rana : మను భాకర్ గురువు ఇకలేరు.. జస్పాల్ రాణా మృతి
Jaspal Rana : భారత షూటింగ్ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. దేశ గర్వించదగ్గ లెజెండరీ షూటర్, ప్రముఖ కోచ్ జస్పాల్ రాణా (49) శుక్రవారం కన్నుమూశారు. ఈ వారం..
jaspal rana
Jaspal Rana : భారత షూటింగ్ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. దేశ గర్వించదగ్గ లెజెండరీ షూటర్, ప్రముఖ కోచ్ జస్పాల్ రాణా (49) శుక్రవారం కన్నుమూశారు. ఈ వారం ప్రారంభంలో ఆయనకు తీవ్ర గుండెపోటు (కార్డియాక్ ఎమర్జెన్సీ) రావడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భారత పిస్టల్ షూటర్లకు హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌గా సేవలు అందిస్తున్నారు.
మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) వరల్డ్ కప్ ముగించుకుని భారత్‌కు తిరిగి వస్తున్న సమయంలో జస్పాల్ రాణా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఢిల్లీ చేరుకున్న వెంటనే ఆయనను సాకేత్ లోని మ్యాక్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఆయనకు గుండెలో బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించి ఒక స్టెంట్ వేశారు. రాబోయే రోజుల్లో రెండో స్టెంట్ వేయడానికి ప్లాన్ చేశారు. ఆయన కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలోనే శుక్రవారం ఉదయం మరణవార్త రావడంతో క్రీడాలోకం దిగ్భ్రాంతికి లోనైంది.
అసిడిటీ అనుకుని పొరబడ్డారు – సోదరుడు సుభాష్ రాణా
జస్పాల్ రాణా ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు సుభాష్ రాణా మీడియాతో మాట్లాడారు. "మ్యూనిచ్ వరల్డ్ కప్ సమయంలోనే జస్పాల్‌కు ఛాతీలో నొప్పి, అసౌకర్యం కలిగాయి. అయితే ఆయన దానిని సాధారణ అసిడిటీగా భావించి ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ ఇండియాకు తిరిగి వచ్చే జర్నీలో ఆ నొప్పి మళ్లీ ఎక్కువైంది. దీంతో ఢిల్లీ ల్యాండ్ అవ్వగానే వెంటనే ఆసుపత్రికి తరలించాము" అని ఆయన వెల్లడించారు. జస్పాల్ రాణా మరణం భారత షూటింగ్ రంగానికి కోలుకోలేని పెద్ద దెబ్బ.
మను భాకర్ ఒలింపిక్ మెడల్స్ వెనుక అసలైన శిల్పి
ఇటీవలి కాలంలో స్టార్ షూటర్ మను భాకర్‌తో జస్పాల్ రాణాకు ఉన్న గురు-శిష్యుల అనుబంధం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. మను భాకర్ కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో రాణా ఆమెకు అండగా నిలిచి, తిరిగి ఫామ్‌లోకి తెచ్చారు. వీరిద్దరి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతం సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, అలాగే మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో రెండు కాంస్య (బ్రాంజ్) పతకాలు సాధించింది. స్వతంత్ర భారత చరిత్రలో ఒకే ఒలింపిక్ ఎడిషన్‌లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా మను భాకర్ రికార్డు సృష్టించడంలో రాణా పాత్ర ఎనలేనిది.
మను భాకర్‌తో పాటు సౌరభ్ చౌదరి, అనీష్ భాన్వాలా, చింకీ యాదవ్ వంటి ఎందరో టాప్ షూటర్లు ఈయన పర్యవేక్షణలోనే రాటుదేలారు. జూనియర్ ప్రోగ్రామ్‌లో ఆయన చేసిన కృషి వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టే ఒక బలమైన షూటర్ల బృందం తయారైంది. ఆయన సేవలను గుర్తించిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI), ఫిబ్రవరి 2025లో ఆయనను 25 మీటర్ల పిస్టల్ విభాగానికి హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌గా నియమించింది. అంతకుముందు 2020 లో ఆయనకు ప్రతిష్టాత్మక 'ద్రోణాచార్య అవార్డు' లభించింది.
అద్భుతమైన క్రీడా కెరీర్.. పతకాల రారాజు
కోచ్‌గా మారడానికి ముందే, జస్పాల్ రాణా భారతదేశం అందించిన అత్యుత్తమ పిస్టల్ షూటర్లలో ఒకరిగా తన ముద్ర వేశారు. 1976 జూన్ 28న ఉత్తరాఖండ్‌లో జన్మించిన రాణా, 1994లో మిలాన్‌లో జరిగిన వరల్డ్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ జూనియర్ కేటగిరీలో ప్రపంచ రికార్డు స్కోరుతో బంగారు పతకం సాధించి అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించారు. అదే ఏడాది ఆసియా క్రీడల్లో (Asian Games) 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో పసిడి పతకం గెలిచారు.
ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో దేశానికి వందలాది పతకాలు అందించారు. కామన్వెల్త్ క్రీడల్లో 9 స్వర్ణాలతో సహా మొత్తం 15 పతకాలు సాధించి, ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన భారతీయ షూటర్‌గా రికార్డు సృష్టించారు. ఇక 2006 దోహా ఆసియా క్రీడల్లో మూడు బంగారు పతకాలు గెలవడంతో పాటు ప్రపంచ రికార్డును సమం చేయడం ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఆయన ప్రతిభకు గుర్తింపుగా 18 ఏళ్ల చిన్న వయసులోనే 'అర్జున అవార్డు', ఆ తర్వాత 21 ఏళ్లకు 'పద్మశ్రీ' పురస్కారాలు లభించాయి.
ప్రముఖుల సంతాపం
జస్పాల్ రాణా హఠాన్మరణంపై క్రీడా, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా ఎక్స్ (X) ద్వారా స్పందిస్తూ.. రాణా మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. "అంతర్జాతీయ షూటర్ జస్పాల్ రాణా అకాల మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. జస్పాల్ కేవలం ఒక గొప్ప అథ్లెట్, కోచ్ మాత్రమే కాదు.. చాలా సరళమైన, దయా హృదయుడైన వ్యక్తి. భారతదేశంలో షూటింగ్ క్రీడను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని రాజ్‌నాథ్ సింగ్ రాశారు. క్రీడాకారుడిగా, కోచ్‌గా మూడు దశాబ్దాల పాటు భారత షూటింగ్ రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన జస్పాల్ రాణా భౌతికంగా దూరమైనా, ఆయన అందించిన పతకాలు, తయారుచేసిన ఛాంపియన్లు ఎప్పటికీ నిలిచే ఉంటారు.




